Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు
- 24 గంటల్లో 24వేలకు పైగా కొత్త కేసులు
- 101 మంది మృతి
విజయవాడ:రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలతో రాష్ట్రం కకావికలమవుతోంది. తాజాగా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 24 గంటల వ్యవధిలో 24వేలకు పైగా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. మరణాలు కూడా వంద దాటాయి. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు 94,550 మంది నుండి సేకరించిన శ్యాంపిల్స్‌ను పరీక్షించగా 24,171 మందికి వైరస్ సోకింది. ఈ సమయంలోనే 101 మంది మరణించారు. కరోనా మొదటి, రెండవ దశల్లో 24 గంటల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. దీంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అనంతపురం జిల్లాల్లో అత్యధికంగా 14 మంది ఈ వైరస్ బారిన పడి మరణించారు. విశాఖపట్నంలో 11 మంది, చిత్తూరులో 10 మంది, తూర్పు, గుంటూరు, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున, నెల్లూరులో 7 మంది, కర్నూల్, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో 6 మంది చొప్పున, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, కడపలో ఇద్దరు చొప్పున మరణించారు. అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా 3,356 మంది గడిచిన 24 గంటల్లో ఈ వైరస్ బారిన పడ్డారు. అత్యల్పంగా కృష్ణలో 705, కర్నూలులో 730 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 21,101 మంది గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు.
దేశవ్యాప్తంగా మళ్లీ నాలుగు వేలు దాటిన మరణాలు
దేశ వ్యాప్తంగా రోజువారి మరణాల సంఖ్య మళ్లీ నాలుగువేలు దాటింది. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు కరోనాకారణంగా 4,077 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే, కొత్తగా పాజిటివ్ బారిన పడిన వారి సంఖ్యలో శనివారంతో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించింది. 18,32,950 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,11,170 మందికి వ్యాధి సోకినట్టు నిర్ధారణైంది. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,46,84,077కు, చనిపోయిన వారి సంఖ్య 2,70,284కు చేరింది. గత 24 గంటల్లోనే 3,62,437 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,07,95,335కి చేరింది. ప్రస్తుతం దేశంలో 36,18,458 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ దేశంలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 31,48,50,143కి చేరింది.