Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిపుణుల హెచ్చరికలు గాలికి..
- ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నేడు నిత్యం వేలల్లో మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కనీస వైద్యం అందక నిత్యం వందలాది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వివిధ దేశాల్లో కరోనా మరణ మృదంగం మోగించడం, భారత్‌లోనూ త్వరలోనే కరోనా ఉధృతి అధికం కానుందని నిపుణుల హెచ్చరికలతో పాటు వైద్య సదుపాయాలను వేగంగా పెంచాలని అనేక అంతర్జాతీయ సంస్థలు ముందే హెచ్చరించాయి. అయితే, ఇవేవి పట్టించుకోని ప్రభుత్వాల నిర్లక్ష్యధోరణి కారణంగా నేడు దేశంంలో నిత్యం వేలల్లో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుత గణాంకాలు పరిశీలిస్తే భారత్‌లో కరోనా మొదటి, సెకండ్ వేవ్ మధ్య కాలంలో రోజువారీ కరోనా కేసులు 300 శాతం పెరిగితే ఐసీయూ పడకలు కేవలం 19 శాతం మాత్రమే పెరిగాయి.
భారత్‌లో కరోనా మొదటివేవ్లో 17 సెప్టెంబర్ 2020న రోజువారి కేసులు గరిష్టంగా 97,894 నమోదయ్యాయి. అప్పటికి దేశంలో 63,758 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. ఏప్రిల్ 4న భారత్‌లో ఒకే రోజు 1.03 లక్షల కేసులతో భయంకరమైన మైలురాయిని దాటుతూ.. కరోనా కేసులు అధికంగా ఉన్న అమెరికా తర్వాత రెండో దేశంగా నిలిచింది. ఇక ఏప్రిల్ 15న రెండు లక్షల మార్కును, ఏప్రిల్ 22న మూడు లక్షల మార్కును దాటి ప్రపంచ రికార్డును సృష్టించింది. మే1న రోజువారీ కేసులు ఏకంగా 4,01,993 దాటాయి. మే7న అత్యధికంగా ఒకే రోజు 4,14,188 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలు సైతం గణనీయంగా పెరుగుతూ.. నిత్యం 4 వేలకు పైగా నమోదవుతున్నాయి. అయితే, ఈ స్థాయిలో కరోనా విజృంభణ కొనసాగుతున్న దేశంలో ఐసీయూ పడకలు, ఇతర వైద్య సౌకర్యాలలో పెద్దగా మెరుగుదల మార్పు చోటుచేసుకోలేదని ప్రభుత్వ గణాంకాలే నిదర్శనంగా నలుస్తున్నాయి. ఏప్రిల్ నాటికి భారత్‌లో 75,867 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అంటే రోజువారీ కరోనా కేసులు గరిష్టంగా 323 శాతం పెరిగితే.. ఐసీయూ పడకలు మాత్రం 18.99 శాతం మాత్రమే పెరిగాయి. ఇక గతేడాది ఏప్రిల్‌లో భారత్‌లో కేవలం 24,000 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. అయితే, కరోనా కేసులు పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని వాటిని సెప్టెంబర్ నాటికి పెంచారు. రోజువారీ కేసులు తగ్గుతుండటంతో ఈ ఏడాది జనవరి నాటికి ఐసీయూ బెడ్ల సంఖ్య మళ్లీ 36,008కు పడిపోయింది. అయితే, త్వరలోనే మళ్లీ భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతుందని వైద్య నిపుణులు, వివిధ సర్వేలు హెచ్చరించినా కేంద్రం పట్టించుకోలేదు. సాధారణ పడకలు, ఆక్సిజన్, టీకాలు సహా ఇతర మందులను సరిపడంతగా అందుబాటులోకి తీసుకురాకపోవడంతో నేడు కనీస వైద్యం దొరక్క రోగులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి దాపురించింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఐసీయూ పడకలు నిండిపోయాయి. తాజా డేటా ప్రకారం.. ముంబయిలోని 2,984 ఐసీయూ పడకల్లో 277 (9.28 శాతం) ఖాళీగా ఉన్నాయి. గోవాలో అన్ని నిండిపోయాయి. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూకాశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. అయితే, కేరళ, ఛత్తీస్‌గఢ్‌లలో ఐసీయూ పడకల పరిస్థితి కాస్తమెరుగ్గా ఉంది. కాగా, దేశంలో కొత్తగా 3.26 లక్షల కేసులు, 4 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.