Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో కరోనా మరణాలపై ఐహెచ్ఎంఇ అంచనా
- అధికారిక అంకెలకు వాస్తవ పరిస్థితికి పొంతనే లేదు
- మృతుల వాస్తవ సంఖ్యను దాచిపెడుతున్న ప్రభుత్వాలు
న్యూఢిల్లీ : కోవిడ్‌తో దేశంలో ఇంతవరకు ఎన్ని మరణాలు చోటుచేసుకున్నాయో తెలుసా? కరోనా రెండో దశ మరణాల సంఖ్యను ప్రభుత్వాలు తగ్గించి చూపిస్తున్నాయి. కరోనాతో చనిపోయివారికి అంత్యక్రియలు నిర్వహించాలంటే శ్శశానాల్లో చోటు దొరకని స్థితి. గంటలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక వైపు ఇటువంటి పరిస్థితి ఉంటే మరో వైపు ప్రభుత్వం కరోనా మరణాలు తగ్గించి చూపే ప్రయత్నం చేస్తోంది. నేడు అందరి నోటా వినిపించే మాట ఇదే. వాస్తవంగా కరోనాతో సంభవిస్తున్న మరణాలకు, ప్రభుత్వం అధికారికంగా చూపే మరణాలకు తేడా ఎందుకు ఉంటోంది. దీని వెనక జరుగుతున్నదేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఎ) నివేదిక సాధికారికంగా వెల్లడిస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా సోకిన వారిలో దాదాపు 70 లక్షల మంది మరణించినట్లు ఒక అంచనా. ఇది అధికారిక గణాంకాల కంటే రెండు రెట్లు అధికం. ఇదే సమయంలో భారత్‌లో 2.25 లక్షల మంది మరణించారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే వాస్తవానికి ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా, అంటే 6.5 లక్షల మంది చనిపోయి ఉంటారని సియాటెల్లోఐహెచ్ఎంఎ తెలియజేసింది. భారత్‌లో కోవిడ్ మరణాల సంఖ్య వచ్చేసెప్టెంబర్ నాటికి 10 లక్షలకు చేరే అవకాశం ఉందని అది హెచ్చరించింది.
కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్‌తో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధానంగా బిజెపి పాలనలో ఉన్న రాష్ట్రాలు కోవిడ్ మరణాలను బయటకు రాకుండా తొక్కిపెడుతున్నా యని ఐహెచ్ఎంఎ పరిశీలన బట్టి తెలుస్తోంది తగిన వైద్య సదుపాయాలు లేక, ఔషధాల కొరతతో కరోనా బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణిస్తున్న విషాదకర పరిస్థితి నెలకొంది . దేశంలోని శ్మశాన వాటికలు 24 గంటలూ పనిచేస్తున్నాయి.పార్కింగ్ ప్రాంతాలు కూడా దహన సంస్కారాలు నిర్వహించే వల్లకాడులుగా మారిపో యాయి. ఇటీవల యుపి, బీహార్ రాష్ట్రాల పరిధిలోని గంగా నదిలో మతదేహాలు కొట్టుకుపోతున్న ఘటనలు చూశాం. వీరంతా కరోనాతో చనిపోయిన వారేనని, అయితే ఈ మతదేహాలను నదిలో ఎందుకు పడేశారన్న ప్రశ్నలు ఎదురౌతున్నాయి. వేలాది మరణాలను కరోనా గణాంకాల్లో చేర్చకుండా ఉండేందుకు ఈ విధంగా చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. దేశంలోని నలుమూల ప్రాంతాల్లో అనేక కరోనా మరణాలు రికార్డులకెక్కడం లేదు. వీటిని కరోనా మతుల లెక్కల్లో చేర్చడం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మరణాలు
అమెరికా, జపాన్ వంటి అభివద్ధి చెందిన దేశాలలో కూడా వాస్తవికతను తప్పుదారి పట్టించే విదంగా మరణాలకు సంబంధించిన అధికారిక గణాంకాలు ఉంటున్నాయని ఐహెచ్ఎంఎ నివేదిక పేర్కొంది. మరణాల సంఖ్యపై
అంచనా వేసేందుకు అధునాతన పద్ధతిని ఉప యోగించి, వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది మరణించి ఉంటారని తెలిపింది. అధికా రిక లెక్కలు, ఇతర ధ్రువీకరించబడిన వనరుల అధారంగా వాస్తవానికి ఈ మరణాల సంఖ్య చెప్పిన దాని కంటే రెండు రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. అదేవిధంగా భారత్‌లో కూడా మే 6 నాటికి 2.21 లక్షలు అని చెబుతున్న అధికారిక లెక్కలు కాకుండా, దాదాపు 6.54 లక్షల మంది మరణించి ఉంటారని పేర్కొంది.
లెక్కల్లో వైరుధ్యం
మరణాలపై స్థానిక, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న గణాంకాలకు, దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న కరోనా మతుల దహన సంస్కారాల సంఖ్యపై కోవిడ్-19 ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా జర్నలిస్టులు పరిశీలించారు. మరణాల సంఖ్యపై వాస్తవానికి, ప్రభుత్వాలు చెబుతున్న సంఖ్యలో ఇక్కడ వారు భారీ వైరుధ్యాన్ని గమనించారు. ఒక జర్నలిస్టు అయితే దహన సంస్కరాలు జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించి ఉపగ్రహ చాయాచిత్రాలను కూడా సేకరించాడు. ఇది అక్కడి చితుల సంఖ్యను దరిదాపుగా తెలుపుతోంది. దీన్ని అదే ప్రాంతానికి చెందిన మునుపటి చిత్రాలతో పోల్చి మరణాల సంఖ్య భారీగా పెరిగిందని నివేదించాడు.
గుజరాత్లో భారీగా డెత్ సర్టిఫికెట్ల జారీ
ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 10 వరకు గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాల సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే రెట్టింపు స్థాయిలో ఉంది. ఈ సర్టిఫికెట్ల సంఖ్య, అధికారిక మరణాల సంఖ్యతో పోల్చి చూస్తే గుజరాత్ ప్రభుత్వం కరోనా మరణాలను చాలా వరకు బయటకు రాకుండా ఎలా తొక్కిపట్టినదీ స్పష్టమౌతుందని స్థానిక పత్రిక 'దివ్య భాస్కర్' తెలిపింది. ఈ 71 రోజుల కాలంలో గుజరాత్ ప్రభుత్వం 1.23 లక్షల డెత్ సర్టిఫికెట్లు జారీ చేసింది. గత ఏడాది ఇదే కాలానికి సంబంధించి ఈ సంఖ్య 58 వేలుగా ఉంది. అయితే రాష్ట్రంలో ఈ వ్యవధిలో కేవలం 4,218 మంది మాత్రమే మరణించారని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ గణాంకాలను వివరించిన పత్రిక రాష్ట్ర ప్రభుత్వం మరణాల సంఖ్యపై తప్పుడు లెక్కలు చెబుతోందని విమర్శించింది. పత్రికల్లో వచ్చిన నివాళి ప్రకటనలను సేకేరించి ఎంత మంది చనిపోయారో సవివరంగా ఒక జాబితాను ప్రచురించింది..
విశ్వసనీయత కోల్పోయిన అధికారిక గణాంకాలు
స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద విపత్తును ఎదుర్కొంటున్న సమయంలో అధికారిక గణాంకాలు తమ విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయాయి. గతంలో సంభవించిన అంటువ్యాధుల ప్రభావానికి సంబంధించిన గణాంకాల నమ్మకమైన, సమ్రగమైన అంచనాలు వచ్చేందుకు చాలా సమయం పట్టేది. అయితే ప్రస్తుత కరోనా వైరస్‌కు సంబంధించిన గణాంకాల విశ్వసనీయ అంచనాలు చాలా వేగంగా వస్తున్నాయి. ఈ తప్పుడు లెక్కలకు కారణం రాజకీయ జోక్యం ఒక్కటే కాదు, దేశంలో దారుణంగా ఉన్న ఆరోగ్య పరిరక్షణ మౌలిక సదుపాయాలు కూడా అని ఐహెచ్ఎంఇ నివేదిక పేర్కొంది.
అన్ని దేశాల్లోనూ తప్పు లెక్కలే!
అమెరికాలో 5.74 లక్షలు అని అధికారికంగా చెబుతున్న కరోనా మరణాల సంఖ్య వాస్తవానికి 9.05 లక్షలుగా ఉంటుందని ఐహెచ్ఎంఇ విశ్లేషించింది. మెక్సికోలో మరణాలు 2.18 లక్షలు కాదని, దాదాపు 6.17 లక్షలు ఉంటాయని పేర్కొంది. కోవిడ్‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న మరో దేశం బ్రెజిల్లో మరణాల సంఖ్య 5.96 లక్షలు(అధికారికంగా 4.08 లక్షలు) ఉండే అవకాశం ఉందని తెలిపింది. రష్యాలో అయితే అధికారికంగా చెబుతున్న మరణాల(1.09 లక్షలు) కంటే వాస్తవంగా ఆరు రెట్లు(5.94 లక్షలు) అధికంగా ఉంటాయని నివేదించింది. ఇక జపాన్‌లో అయితే 2020 మార్చి నుంచి 2021 మార్చి వరకు 10,230 మంది మరణించారని అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇక్కడ మరణాల సంఖ్య 1,08,320 వరకు ఉంటాయని పేర్కొంది. ఇంకా ఇటలీ, బ్రిటన్‌తో పాటు ఈజిప్టు, కజకిస్తాన్, పలు యూరప్ తూర్పు దేశాలు మరణాలను తక్కువగా చూపాయని తెలిపింది. ఒకవేళ కొంత మంది సంశయవాదులకు ఈ ఎహెచ్ఎంఇ గణాంకాలు ఎక్కువగా అనిపిస్తే.. బ్రిటీష్ పబ్లి కషన్ ఈనెల 15న అంత కంటే అధిక సంఖ్యలో అంచ నాలు వేసింది. ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 71 లక్షల నుంచి కొటి 27 లక్షల మధ్య, మధ్యస్త అంచనాగా దాదాపు కొటి 2 లక్షల ఉండే అవకాశం ఉందని అది నివే దించింది. ఈ సందర్భంగా భారత్‌ను ప్రస్తావిస్తూ.. రోజుకు దాదాపు 4 వేలుగా చెబుతున్నఅధికారిక కరోనా మరణాల కంటే 6 వేల నుంచి 31 వేల వరకు ఉంటాయని పేర్కొంది.
సెప్టెంబర్ నాటికి తీవ్రస్థాయిలో మరణాలు
భారత్‌లో ఇప్పటి నుంచి సెప్టెంబర్ నెల మధ్యలో తీవ్రస్థాయిలో మరణాలు సంభవించే అవకాశం ఉందని ఐహెచ్ఎంఇకి చెందిన డాక్టర్ ముర్రే హెచ్చరించారు. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మరణాలు సంభవిస్తాయని, వాటిలో సగం అంటే 10 లక్షల వరకు భారత్‌లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఐహెచ్ఎంఇ నివేదిక నుంచి తీసుకోవాల్సిన పాఠమేమిటంటే కరోనాపై పోరులో ముందుకు వెళ్లేందుకు కచ్చితమైన, వేగవంతమైన కరోనా పరీక్షలు నిర్వహించడం. భారత్‌లో కరోనా పరీక్షల తీరు దారుణంగా ఉంది. ఏప్రిల్ 30న 19.5 లక్షలుగా ఉన్న పరీక్షల సంఖ్య.. వైరస్ ఉధతమౌతున్న వేళ మరింత పెంచాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఉన్నాయి. మే 11 అయితే ఇంకా తక్కువగా 18.6 లక్షల పరీక్షలు మాత్రమే నిర్వహించారు. కరోనా మొదటి దశ ముగింపు సమయంలో ఒక కేసు నిర్ధారణ అయ్యేందుకు 63 మందికి పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఇప్పుడు ఒక కేసుకు 4.5 పరీక్షలుగా మాత్రమే ఉంది. కోవిడ్ పాజిటివిటీ రేటు 1.6 శాతం నుంచి ప్రస్తుతం 22.3 శాతానికి పెరిగింది. అంటే 14 రెట్లు అధికంగా ఉందన్నమాట. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం.