Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడేండ్ల తర్వాత 'బ్రాండ్ మోడీ' ఐసీయూలో ఆక్సిజన్‌పై కొన ఊపిరితో ఉంది. కరోనా మహమ్మారి ధాటికి దేశమంతా గగ్గోలు పెడుతుంటే ప్రధాని మోడీ మౌనవ్రతం వహించటం..ఆయన శ్రేయోభిలాషులు, మద్దతుదారులకు సైతం మింగుడుపడటం లేదు. ఈ మహమ్మారిని ఎదుర్కొవటంలో మోడీ సర్కార్ సామర్థ్యాన్ని ఆయన మద్దతుదారులే ప్రశ్నిస్తున్నారు.
- ప్రముఖ జర్నలిస్టు ప్రభు చావ్లా
- కరోనాతో వేలాది ప్రాణాలు పోతుంటే
- ప్రధాని మౌనం : రాజకీయ విశ్లేషకులు
- ఆయన మద్దతుదారులకే మింగుడుపడటం లేదు
- సంక్షోభ సమయాన మాటలతో ఊరడించటం కాదు..
- మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ నిజమే అయితే.. ఈ కొరతలేంటి?
న్యూఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశ ప్రజల్లో ఎన్నో ఆశలు నింపి నరేంద్రమోడీ ప్రధాని అయ్యారు. కానీ అధికారంలోకి రాగానే కార్పొరేట్ అనుకూల విధానాలకు తెరలేపారు. కార్మిక చట్టాల్ని నిర్వీర్యం చేశారు. జీఎస్టీ తీసుకొచ్చి పన్నుల భారం పెంచారు. ప్రయోజనాలు కార్పొరేట్ వర్గాలకు అందేట్టు చూశారు. '' పనిచేసే నాయకుడు మాట్లాడడు, చేసి చూపిస్తాడు'' అనేది తన విధానమని ప్రధాని మోడీ పలుమార్లు చెప్పారు. ఈ లెక్కన మోడీ సర్కార్ విధానాలు దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయో..దేశమంతా చూస్తోంది. ఆయన పాలనా సామర్థ్యంపై విమర్శకులేకాదు, ఆయన శ్రేయోభిలాషులు సైతం సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు ఉపయోగిపడిందా?
కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చింది మొదలు..దేశ ప్రజలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. గత ఏడాది ఏకపక్షంగా కఠినమైన లాక్డౌన్ విధించి..కోట్లాదిమంది కార్మికుల్ని రోడ్డునపడేశారు. ఇప్పుడు మళ్లీ కరోనా రెండో వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ బాధితుల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, ఏదైనా చేస్తుంది, సంక్షోభాన్ని నియంత్రిస్తుంది..అనే నమ్మకం ఇప్పుడు ప్రజల్లో లేదు. గత ఏడాది వైరస్ ప్రభావం తగ్గిందని చెప్పి, ఆ ఘనతంతా తమనదేనని మోడీ సర్కార్ ప్రచారం చేసుకుంది. ఇతర దేశాలకన్నా మెరుగ్గా వైరస్‌ను కట్టడి చేశామని బీజేపీ నేతలు చెప్పుకున్నారు. వ్యాక్సిన్ పరిశోధనలకు పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని కేంద్రం చెప్పుకుంది. అదంతా ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుందా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రయోజనం కోసం బీజేపీ నాయకులు ఆ అంశాలు వాడుకున్నారు తప్ప, వాస్తవంగా కరోనాబారి నుండి ప్రజల్ని రక్షిస్తున్నారా?..అన్నది చర్చనీయాంశమైంది.
సెంటిమెంట్‌తో కొడుతున్నారు
రెండో వేవ్ ఉధృతి మొదలయ్యాక, రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నవేళ..ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..'' అత్యంత భీకరమైన ఒక మహమ్మారి వచ్చింది. వందేండ్లకొకమారు వచ్చే ఇలాంటి వైరస్ ప్రపంచాన్ని పరీక్షకు గురిచేస్తోంది. మనముందు కనిపించని శత్రువు ఉంది. దీనికారణంగా మన ఆత్మీయులెంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా బాధలు పడుతోంది. ఆ బాధేంటో నాకూ తెలుసు'' అని చెప్పారు. మొదటి వేవ్ తర్వాత ప్రధాని మాటల్లో, ఇప్పుడు చెబుతున్నదానికి చాలా తేడా ఉందని విశ్లేషకులు అంటున్నారు. వేదనతో కూడిన మాటలతో, సంభాషణతో ప్రజల కన్నీళ్లు తుడిచే ప్రయత్నమిదని వారు విశ్లేషించారు.
వైరస్బారినపడిన వేలాదిమంది నేడు ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక ఆసుపత్రి ప్రధాన గేట్ వద్దే బాధితుల్ని ఆపుతున్నారు. బెడ్లు లేవు, ఆక్సీజన్ లేదు, ఔషధాలు లేవు..అనే మాటలు వినిపిస్తున్నాయి. అంబులెన్స్‌లోనే ప్రాణాలు కోల్పోవటం సర్వసాధారణంగా మారుతోంది. బాధితుల వేదనను, ఆగ్రహాన్ని, ఆందోళనను తట్టుకోవడానికి, దారిమళ్లించడానికి ప్రధాని 'సెంటిమెంట్ డైలాగులు' వదులుతున్నారని విమర్శలున్నాయి. ప్రధాని తీరును ఆయన మద్దతుదారులే తీవ్రంగా తప్పుబడుతున్నారు. మొత్తం వ్యవస్థే కుప్పకూలిందని, విఫలమైందని ప్రజలంతా భావిస్తున్నారు. ఒక సంక్లిష్టమైన సంక్షోభం (కరోనా వైరస్) నేడు ప్రతి ఇంటిముందుకొచ్చి భయపెడుతోంది. దీనికి కారణం మన పాలకులు కాదా? అని సర్వత్రా ఆరోపిస్తున్నారు.
వ్యాక్సినేషన్ కీలకమని మరిచారు
వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటంలో అత్యంత కీలకమైనది వ్యాక్సినేషన్. ఈ సంగతి నిపుణులైన వైద్యులు, ఇతర ఉన్నతాధికారులు కేంద్రానికి కొన్ని నెలల ముందే నివేదిక ద్వారా తెలియజేశారు. అమెరికా 120కోట్ల డోసులకు, ఈయూ సమాఖ్య 130కోట్ల డోసులకు, బ్రిటన్ 50కోట్ల డోసులకు, బ్రెజిల్ 23కోట్ల డోసులకు వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఆర్డర్లు ఇచ్చాయి. ఓ వైపు ఇంత జరుగుతున్నా..మనదేశంలో కేంద్రం కేవలం 11కోట్ల వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చి...చేతులు దులుపుకుంది.
మేక్ ఇన్ ఇండియా ..ఏది?
వాస్తవానికి కరోనా సంక్షోభం ఎన్నో అవకాశాల్ని సైతం సృష్టించింది. తయారీరంగంలో పెద్ద ఎత్తున డిమాండ్‌ను తీసుకొచ్చింది. ఔషధాలు, ప్రాణాల్ని కాపాడే విలువైన ఔషధాలు, వెంటిలేటర్లు, ఆక్సీజన్ ప్లాంట్లు, సర్జికల్ మాస్కులు, ఎన్95 మాస్కులు, పీపీఈ కిట్లు, పల్స్ ఆక్సీమీటర్లు, ఫేస్‌షీల్డ్‌లు, రెమిడెసివర్ ఇంజెక్షన్లు..ఇవన్నీ మనదేశంలో తయారు చేయవచ్చు కదా? అనే ప్రశ్న సామాన్యుడ్ని వేధిస్తోంది. మార్కెట్లో వీటిని కొనడానికి జనం ఎగబడుతున్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద తయారీ చేపట్టాలి కదా? ఇదంతా జరగలేదు కాబట్టే, నేడు దేశం విదేశీ సాయం కోసం ఎదురుచూడాల్సి వస్తోందని విశ్వసనీయ సమాచారం.
గుజరాత్ మోడల్‌ను నమ్ముకున్నారా?
ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల భారత్‌కు 'వైద్య సామాగ్రి, ఔషధాల కొరత' ఉంది. ఆహార ఉత్పత్తిలో, సాంకేతిక పరిజ్ఞానంలో, ఔషధ తయారీలో భారత్ నిజంగానే స్వయం సమృద్ధి సాధించింది. ఇది నిజం. అయినప్పటికీ దేశంలో మెడికల్ ఆక్సీజన్ లేక ఎన్నోవేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పాలకుల ఆర్థిక విధానాల ఫలితమిదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 'గుజరాత్ మోడల్'లో ఎంచుకున్న పాలనా విధానం కేంద్రం వైఫల్యానికి ఒక ప్రధాన కారణమని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
వృత్తి నైపుణ్యం కలిగినవారు, శాస్త్రవేత్తలు, పేరొందిన వైద్య నిపుణులు..ప్రధాని మోడీకి దూరమయ్యారని, దాని ఫలితమే కేంద్రం వైఫల్యానికి దారితీసిందని సమాచారం.