Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్తం గడ్డకట్టిన ఘటనలు
- 26 కేసుల్లో వెల్లడి : ఎఇఎఫ్ఐ నివేదిక
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసిన తరువాత రక్తస్రావం లేదా రక్తం గడ్డకట్టిన 26 సంఘటనలు చోటుచేసుకున్నాయని నేషనల్ అడ్వెర్స్ ఆవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ (ఎఇఎఫ్ఐ) పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు ఒక నివేదిక సమర్పించింది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత పలు రకాల ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొన్నట్లు దేశంలోని 753 జిల్లాలకు గానూ 684 జిల్లాల నుంచి కోవిన్ వెబ్‌సైట్‌కు 23 వేల ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. వీటిలో 700 కేసులు (10 లక్ష డోసులకు 9.3 కేసులు) మాత్రమే సీరియస్, తీవ్రమైనవిగా తేలిందని ఎఐఎఫ్ఐ ఈసందర్భంగా పేర్కొంది. వీటిల్లో 26 కేసుల్లో రక్తస్రావం లేదా రక్తం గడ్డకట్టిన ఘటన (10 లక్షల డోసులకు 0.61 కేసులు) నమోదైనట్లు కమిటీ వెల్లడించింది. ఈ సంఖ్య బ్రిటన్‌లో 10 లక్షల డోసులకు 4 కేసులుగా, జర్మనీలో 10 కేసులుగా ఉంది. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి థ్రొంబో ఎంబోలిక్ ఘటనలు చోటుచేసుకోలేదని కమిటీ తెలిపింది. థ్రొంబో ఎంబోలిక్ లక్షణాలు (శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తులు, ఇతర అవయవాల వద్ద నొప్పులు, ఇంజెక్షన్ వేసిన ప్రాంతాన్ని దాటి చర్మంపై ఎర్రగా రావడం)పై ప్రజలకు తెలుసుకునేలా అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులు, సిబ్బందికి కేంద్ర ఆరోగ్యశాఖ విడిగా ఆదేశాలు జారీచేసింది.
ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనికా భాగస్వామ్యంతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మన దేశంలో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. పలు ప్రతికూల ఘటనలు ఎదురైన నేపథ్యంలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వినియోగానికి ఈ ఏడాది మార్చిలో డెన్మార్క్, వెనిజులా, ఇండోనేషియా వంటి దేశాలు ఆపిన విషయం తెలిసిందే. కొన్ని కేసుల్లో మరణాలు కూడా సంభవించాయి. ఈ నేపథ్యంలో విశ్లేషణ చేసిన యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ.. ఈ వ్యాక్సిన్ సమర్ధ వంతమైన, సురక్షితమైనదని పేర్కొంది. రక్తం గడ్డకట్టడం వంటి ప్రతికూల ఘటనలను కూడా కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది.