Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టులు, వ్యాక్సిన్ల పంపిణీలో తగ్గుదల
న్యూఢిల్లీ బ్యూరో
కరోనా కేసులు, మరణాల విషయంలో అధికారిక లెక్కలకూ వాస్తవాలకూ మధ్య వ్యత్యాసం అనేక రెట్లు అధికంగా ఉంటోంది. అదే సమయంలో అధికారిక లెక్కల్లో సైతం కరోనా మరణాలు గత కొన్ని రోజులుగా నాలుగు వేలకు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో 4,106 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు 2,74,390 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో సోమవారం పేర్కొంది. గత 24 గంటల్లో 15,73,515 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,81,386 మందికి పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ 20న 2.95 లక్షల మందికి కరోనా నిర్ధారణ కాగా, ఈ తరువాత 3 లక్షలకు దిగువన కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో టెస్టుల సంఖ్యను తగ్గించడం వల్లే కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 35,16,997 మంది కరోనాతో బాధపడుతున్నారు. గత 24 గంటల్లో 3,78,741 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మొత్తం కేసులు సంఖ్య 2,49,65,463కు చేరగా, 2,11,74,076 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో పాజిటివిటీ రేటు 18.17 శాతానికి తగ్గింది. మరణాల రేటు కూడా 1.10 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 6,91,211 వ్యాక్సిన్ డోసులు మాత్రమే అందజేశారు. ఇప్పటి వరకు 18,29,26,460 డోసులను పంపిణీ చేశారు.
75శాతం కేసులు ఆ పది రాష్ట్రాల్లోనే
దేశంలో 75.04శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, గుజరాత్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అత్యధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 34,389, తమిళనాడులో 33,181 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని అత్యధిక జిల్లాల్లో పాజిటివిటీ రేటు 20శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ అత్యధికంగా మహారాష్ట్రలో 974మంది, కర్ణాటకలో 403మంది చనిపోయారు.