Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: తౌక్టే తుపాను ధాటికి ముంబయి హై ప్రాంతంలో తీరంలో నిలిపివుంచిన రెండు నౌకలు కొట్టుకుపోయాయి. వీటిల్లో 410 మంది సిబ్బంది ఉన్నారు. యాంకర్లు తొలగిపోవడంతో అలల ధాటికి ఆ నౌకలు కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన నేవీ సిబ్బంది వారిని రక్షించడం కోసం తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. 'బాంబే హై ప్రాంతంలో 273 మంది సిబ్బందితో ఉన్న పి305 బార్జ్ హీరా ఆయిల్ ఫీల్డ్స్ నుంచి నీటిపై కొట్టుకుపోతోందని, సాయం చేయాలని వచ్చిన అభ్యర్ధన మేరకు రెస్క్యూ సేవల కోసం ఐఎన్ఎస్ కొచ్చి బయల్దేరింది'' అని నేవీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ముంబయికి 70 కిలోమీటర్ల నైరుతిగా ఈ ఆయిల్ ఫీల్డ్ ఉంది. ఇక జీఏఎల్ కన్స్ట్రక్టర్కు చెందిన మరో బార్జ్ ముంబయి తీరం నుంచి ఎనిమిది నాటికల్ మైళ్లు కొట్టుకుపోయినట్లు నేవీకి మరో అత్యవసర సందేశం అందింది. అందులో 137 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో సహాయక చర్యల నిమిత్తం ఐఎన్ఎస్ కోల్‌కతా యుద్ధనౌక వెళ్లింది. బార్జ్‌లన్నింటికీ యాంకర్ వేసే ఉందని, తౌక్టే తుపాను ధాటికి యాంకర్లు ఊడిపోయి అవి కొట్టుకుపోయాయని నేవీ తెలిపింది. ఈ బార్జ్‌ల్లోని సిబ్బందిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు నౌకాదళ సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
వణుకుతున్న పశ్చిమ తీరం
దేశ పశ్చిమ తీర రాష్ట్రాలను తౌక్టే తుపాను వణికిస్తోంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో పెనుగాలులు, వర్షాలతో బీభత్సం సష్టించిన ఈ తుపాను ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్‌లపై ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబయి నగరంలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉదయం నుంచి రాత్రి వరకు మూసేశారు. విమాన రాకపోకలను నిలిపేశారు. ముంబయికి రావాల్సిన మూడు విమాన సర్వీసులను దారి మళ్లించారు. ఇండిగో విమాన సర్వీసును హైదరాబాద్‌కు, స్పైస్‌జెట్ సర్వీసును సూరత్‌కు, మరో ఇండిగో సర్వీసును లక్నోకు పంపించారు. వర్షాల ప్రభావంతో పలు సబ్ అర్బన్ సర్వీసులను నిలిపేశారు.
అతి భీకర తుపానుగా తౌక్టే
తౌక్టే మరింత బలపడి 'అతి భీకర తుపాను'గా మారినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) సోమవారం వెల్లడించింది. సోమవారం ఉదయం తుపాను వేగం మరింత పుంజుకుందని తెలిపింది. తౌక్టే తుపాను అతి బీకరమైన తుపానుగా మారుతుందని ఇప్పటి వరకూ అంచనా వేయని వాతావరణ శాఖ, తాజాగా ఆ అంశాన్ని చెప్పింది. తుపాను ప్రభావం కారణంగా ఇప్పుడు గంటకు 180-190 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు గంటకు 210 కి.మీ కూడా వీచే అవకాశం ఉందని, తుపాను గుజరాత్ తీరాన్ని తాకిన తర్వాత గాలుల తీవ్రత కూడా తగ్గుతుందని తెలిపింది. ప్రస్తుతం గుజరాత్ వైపు పయనిస్తున్న తౌక్టే.. మంగళవారం ఉదయం నాటికి భావనగర్ జిల్లాలోని పోర్బందర్-మహువా ప్రాంతం వద్ద తీరాన్ని తాకే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
మహారాష్ట్రలో ఆరుగురు మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబయితో సహా అనేక ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. ముంబయి పశ్చిమ శివారుల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. తీరంలో నేవీ సిబ్బందిని అప్రమత్తం చేసింది. ముంబయితో పాటు థానే, రారుగఢ్, పాల్ఘర్ జిల్లాల్లోనూ వర్షాలు పడ్డాయి. కొంకణ్ రీజియన్‌లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మరణించారు. సింధుదుర్గ్ జిల్లా అనందవాడి హార్బర్లో లంగర్ వేసి ఉంచిన రెండు బోట్లు మునిగిపోయాయి. ఈ బోటుల్లో ఏడుగురు ఉన్నారు. వారిలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు అచూకీ లేకుండా పోయారు. మిలిగిన ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. రాయఘడ్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఇంకో వ్యక్తి మరణించినట్లు రాష్ట్ర మంత్రి అధితి టత్కారే ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. రత్నగిరి, సింధుదుర్గ్, రాయఘడ్ జిల్లాల్లోని తీరప్రాంతాలకు చెందిన దాదాపు 12 వేల మందిని పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. రాయఘడ్ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావానికి 839 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.
గుజరాత్లో అప్రమత్తం
తుపాను ప్రభావంతో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ రోగులు ఉన్న ఆసుపత్రుల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టింది. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఏర్పడితే రోగులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వందలాది అంబులెన్స్‌లను సిద్ధం చేశారు.