Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5రాష్ట్రాల ఎన్నికల వేళ 695కోట్ల విరాళాలు
- కోల్కతా, చెన్నై, గౌహతీలలో పెద్ద సంఖ్యలో రూ.కోటి రూపాయల బాండ్లు అమ్మకం
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికలవేళ కేంద్రం చేపట్టిన ఎన్నికల బాండ్ల అమ్మకం వివరాలు పాక్షికంగా బయటకొచ్చాయి. దేశవ్యాప్తంగా 15, 16 దశల్లో 695కోట్ల విలువజేసే బాండ్లు అమ్ముడుపోయాయని 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఎస్బీఐ) తెలిపింది. బాండ్ల అమ్మకాలు అత్యధికంగా పశ్చిమబెంగాల్లో చోటుచేసుకోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. దేశవ్యాప్తంగా కోటి రూపాయల బాండ్లు 348 అమ్ముడుపోగా, అందులో 162 బాండ్లు కోల్కతాలోని ఎస్బీఐ బ్రాంచ్లో నమోదుకావటం గమనార్హం. చెన్నై బ్రాంచ్లో కోటి రూపాయల బాండ్లు 140, ఢిల్లీ బ్రాంచ్లో 165, గౌహతీ (అసోం రాజధాని) బ్రాంచ్లో 37 వరకు నమోదయ్యాయి. చెన్నై, ముంబయి బ్రాంచ్లో నమోదైన రెండు వెయ్యి రూపాయల బాండ్లు తప్ప, మిగతా బాండ్లన్నింటినీ (కోటి, 10లక్షలు, లక్ష రూపాయలవి) ఆయా రాజకీయ పార్టీలు విరాళాలుగా స్వీకరించాయి. వీటి మొత్తాలు ఆయా పార్టీల ఖాతాల్లో నగదురూపంలో జమైంది.
ఏ పార్టీకి ఎంతన్నది బయటకు రాలే ?
ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం చేయాల్సిందిగా ఏప్రిల్ 16న సీపీఐ నాయకుడు కన్హయ్య కుమార్ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా కోరారు. ఈ నేపథ్యంలో 15, 16 దశల ఎన్నికల బాండ్ల వివరాలు ఎస్బీఐ విడుదల చేసింది. ఏ ఏ పార్టీకి ఎంతెంత విరాళాలు అందాయన్న వివరాల్ని మాత్రం విడుదల చేయలేదు. ఇందులో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల కోసమే !
ఈ ఏడాది జనవరి 1 నుంచి 10 వరకు 15వ దశ, ఏప్రిల్ 1 నుంచి 10 వరకు 16వ దశ ఎన్నికల బాండ్ల అమ్మకాలు జరిగాయి. అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చెరీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాండ్ల అమ్మకానికి కేంద్రం తెరతీయటం వివాదాస్పదమైంది. బాండ్ల అమ్మకాన్ని నిలుపుదల చేయాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దాంతో బాండ్ల అమ్మకాలు కొనసాగాయి.
16 రేట్లు అత్యధికం
15వ దశ అమ్మకంలో బాండ్ల అమ్మకం ద్వారా మొత్తం రూ.42.10 కోట్టు విరాళాలు వచ్చాయి. అమ్మకాల్లో కోటి రూపాయల బాండ్లు 34, రూ.10 లక్షల బాండ్లు 78, రూ.లక్ష విలువగలవి 29, రూ.10వేలు విలువగలవి 10 అమ్ముడుపోయాయి. అత్యధికంగా కోల్కతా బ్రాంచ్లో 110 బాండ్లు అమ్ముడుపోయాయి. వీటి ద్వారా రూ.35.75కోట్లు విరాళాలుగా వచ్చాయి.
16దశలో (ఏప్రిల్ 1-10) బాండ్ల అమ్మకం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రూ.653కోట్లు విలువజేసే బాండ్లు అమ్ముడుపోయాయి. 15వ దశతో పోల్చితే ఇది 16రేట్లు అధికం. అమ్ముడుపోయిన బాండ్లలో కోటి రూపాయల బాండ్లు 671 (70శాతం), రూ.10లక్షలు విలువజేసేవి 237, రూ.లక్ష విలువజేసేవి 64, రూ.వెయ్యి విలువగలవి రెండు ఉన్నాయి.