Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో.. కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్న తరుణంలో అవేవీ పట్టించుకోని ప్రభుత్వం కుంభమేళను నిర్వహించింది. కరోనా నిబంధనలతో సంబంధం లేకుండా లక్షలాది మంది పాల్గొన్నారు. దీని కారణంగా అప్పటికే వైద్య సౌకర్యాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉత్తప్రదేశ్‌లో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ప్రస్తుతం అక్కడ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే, కనీస వైద్య సౌకర్యాలు అందక కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు రాష్ట్ర సర్కారు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేవుడే కాపాడాలంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించడం రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. ''రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు కరోనాతో అల్లాడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే చిన్నచిన్న పట్టణాలు, గ్రామాలను ఆ దేవుడే కాపాడాలి'' అంటూ న్యాయమూర్తులు జస్టిస్ సిద్దార్థ వర్మ, జస్టిస్ అజిత్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఓ కరోనా రోగి మరణం గురించి ప్రస్తావిస్తూ.. కరోనా బారినపడ్డ సంతోశ్ కుమార్‌కు ఓ ఆస్పత్రిలో చికిత్స అందించారు. రెస్ట్ రూమ్‌లో కుప్పకూలిపోయి ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతని మరణం తర్వాత... మృత దేహాన్ని గుర్తు తెలియని వ్యక్తిదిగా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది పేర్కొనడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అంతులేని నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే రాష్ట్రంలో ఉన్న వైద్య సదుపాయాలపై..''ఈ కొద్ది నెలల్లోనే రాష్ట్ర వైద్య వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో గ్రహించాం. సాధారణ సమయాల్లోనే అవసరాలు తీర్చలేని వ్యవస్థ.. ఈ మహమ్మారి కాలంలో కూలిపోవాల్సిందే. బిజ్నోర్ జిల్లాలో లెవెల్-3 ఆస్పత్రి లేకపోవడం షాకింగ్‌గా ఉంది. ప్రజలకు సరిపడా ఆస్పత్రుల్లేవు. ఉన్న మూడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 150 పడకలు మాత్రమే ఉన్నాయి. వెంటిలేటర్ల గురించి చెప్పనవసరం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 32లక్షల మందికి 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. అంటే మూడు లక్షల మందికి 30 పడకలు. ఆక్సిజన్ సిలిండర్ల సామర్థ్యం, వాటి నిర్వహణపై శిక్షణ పొందిన సిబ్బంది.. ఇలాంటి తదితర వివరాలు ఏవీ లేవు'' అంటూ సీఎం యోగి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, యూపీలో ఇప్పటివరకు మొత్తం 16,28,990 కరోనా కేసులు, 17,817 మరణాలు నమోదయ్యాయి.