Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు రోజుల్లోనే 29 వేల మంది మృతి
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గకపోగా రికార్డు స్థాయంలో మరణాలు సంభవిస్తున్నాయి. గత వారంలో ఆరు రోజులు నిత్యం 4 వేలకు పైగా మరణాలు సంభవించాయి. గడిచిన వారంలో ఏకంగా 28,727 మంది కరోనా మరణించడం ప్రస్తుత కరోనా మారణహౌమానికి అద్దం పడుతోంది. అయితే, గత రెండు రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా దీనికి ప్రధాన కారణం పరీక్షల సంఖ్య తగ్గడమేనని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుండటం, పాజిటివిటీ రేటు అధికంగా ఉండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,63,533 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో వైరస్‌తో పోరాడుతూ 4,329 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 2,52,28,996కు చేరగా, మరణాలు 2,78,719కి పెరిగాయి. ఇప్పటివరకు 2,15,96,512 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 33,53,765 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 18,44,53,149 మందికి వ్యాక్సిన్లు వేశారు. అలాగే, 31,82,92,881 కరోనా పరీక్షలు నిర్వహించారు.
244 మంది డాక్టర్ల కన్నుమూత
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగతున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది భారీగా కరోనా బారినపడుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య సైతం అథికంగానే ఉంటోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక ఇప్పటివరకు 244 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 50 మంది డాక్టర్లు మరణించారు. మొత్తం వైద్యుల మరణాల్లో అధికంగా బీహార్‌లో 69, యూపీలో 34, ఢిల్లీలో 27 మంది చనిపోయారు. ఇక కరోనా ఫస్ట్‌వేవ్‌లో 736 మంది వైద్యులు మరణించారు. చనిపోయిన వైద్యులలో కేవలం 3 శాతం మంది రెండు డోసులు టీకా తీసుకున్నారని ఐఎంఏ తెలిపింది.
కోవిడ్-19 ఐసీయూ వార్డులోకి వర్షపు నీరు.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లాలోని ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన కరోనా రోగుల ఐసీయూ వార్డులోకి వర్షపు నీరు చేరింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి.. ''కరోనా రోగుల వార్డులోకి వర్షపు నీరు వస్తోంది. మా మాటలు ఏవరూ పట్టించుకోవడం లేదు. రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు'' అంటూ పేర్కొన్నాడు.