Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవన్నీ గంగానదిలో కొట్టుకొచ్చినవే
- యూపీలో దారుణం
- సోషల్ మీడియాలో హల్చల్
- ఐదుగురు పోలీసుల సస్పెన్షన్
లక్నో: కోవిడ్ మహమ్మారి సోకి, ప్రభుత్వం నుంచి సరైన వైద్యం అందక మరణించిన ప్రజల మృతదేహాలపై పాత టైర్లు వేసి, పెట్రోల్ పోసి దహనం చేసిన దుస్సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అక్కడి యోగి సర్కార్ కోవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించడంలో విఫలమవడంతో, మృతదేహాలను గంగానదిలోకి వదిలేసిన విషయం తెలిసిందే. ఈ దృశ్యాలు మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియడంతో వాటిని వెలికితీసిన అక్కడి ప్రభుత్వం ఆ మృతదేహాలపై పాత టైర్లు వేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి, అంత్యక్రియలు పూర్తి చేసింది. బలియా గంగానది తీరంలో జరిగిన ఈ తరహా అంత్యక్రియల్ని పోలీసులే దగ్గరుండి చేయించడం గమనార్హం. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో యోగీ సర్కార్ దిద్దుబాటు చర్యలకు సిద్ధపడింది. ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తూ, ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్టు ఆ జిల్లా ఎస్పీ ప్రకటించారు.
ఏం జరిగిందంటే..?
బీజేపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా..కరోనా సెకండ్‌వేవ్ విజృంభిస్తున్నది. దీనికి పరాకాష్టగా యూపీలో కోవిడ్‌తో మరణించిన వారికి అంత్యక్రియలు చేయటం సమస్యగా మారింది. ఫుట్పాట్లపైనే దహనసంస్కారాలు చేస్తున్నారు. అలా చేయలేని వారు గంగా నదిలో శవాలను వదిలేస్తున్నారు. గంగానదిలో పాజిటివ్ పేషంట్ల శవాలు ప్రవహించడంపై అక్కడి ఉన్నత న్యాయస్థానం మందలించాక.. గంగా ఘాట్లవద్ద పోలీసులను మోహరించారు. అయినా ఇప్పటికీ మృతదేహాలు గంగానదిలో ప్రవహిస్తూనే ఉన్నాయి. బలియా ప్రాంతంలోనూ నీటిలో కొట్టుకువస్తున్న మృతదేహాలను చూసిన పోలీసులు వాటిని పూడ్చకుండా.. దానిపై పెట్రోల్ చల్లి, పాత టైర్లు వేసి నిప్పంటించారు. ఈ వీడియో వైరల్ కావటంతో..ఐదుగురు పోలీసులను సస్పెండ్చేసినట్టు ఎస్పీ విపిన్ తడా తెలిపారు.
27 జిల్లాల్లో రెండువేలకు పైగా శవాలు
గంగానది వెంట ఉన్న 27 జిల్లాల్లో 2 వేలకు పైగా మృతదేహాలను ఖననం చేశామని అధికారులు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో దహనసంస్కారాలకు కలప తక్కువగా ఉన్నదని మీడియా కథనాలు వచ్చాయి. ఆ మరుసటి రోజే గంగా ఘాట్‌లో 500 మీటర్ల దూరంలో..లెక్కలేనన్ని మృతదేహాలు నీటిపై తేలాయి. ఈ శవాలన్నీ యూపీ నుంచే వస్తున్నాయని బీహార్ అధికారులు మొత్తుకున్నారు. చివరకు యూపీలోనే ఈ దుస్థితి ఉన్నదని యోగి సర్కార్ అంగీకరించింది. నీటిలో శవం కనిపిస్తే.. చర్యలు తీసుకోవాలని ఎస్డీఆర్ఎఫ్, పోలీసులకు బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది. జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది.
సంప్రదాయాలు పాటించాలి-యూపీ సీఎం
అందరి మత సంప్రదాయాలను తమ ప్రభుత్వం గౌరవిస్తుందనీ, చనిపోయిన కోవిడ్ మృతదేహాలకు గౌరవప్రదమైన అంత్యక్రియలకు నిధులిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాధ్ ప్రకటించారు. అనాధ శవాలనూ మతవిశ్వాసాల అంత్యక్రియలు చేస్తామని చెప్పారు. ఎవరూ కరోనా శవాలను గంగానదిలోకి వేయొద్దని అన్నారు. ఆక్సిజన్ లేదంటూ ఏ ఆస్పత్రి అయినా ప్రకటిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పలు ఆస్పత్రుల యాజమాన్యాలపై ఇప్పటికే ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు.