Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కేరళలో పినరయి విజయన్ నేతృత్వాన నూతనంగా ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న 11 మంది పేర్లను సీపీఐ(ఎం) మంగళవారం ప్రకటించింది. ఈ జాబితాలో ఇద్దరు మహిళలు సహా అందరూ కొత్తవారే కావడం గమనార్హం. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశమై తమ పార్టీ మంత్రుల జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీలో స్పీకర్ పదవికి ఎంబి రాజేశ్‌ను ప్రకటించింది. తిరువనంత పురం సెంట్రల్ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రుల జాబితాలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎంవి గోవిందన్, కె.రాధాకృష్ణన్, రాష్ట్ర సెక్రెటేరియట్ సభ్యులు కెఎన్.బాలగోపాల్, పి.రాజీవ్, రాష్ట్ర కమిటీ సభ్యులు సాజి చెరియన్, విఎన్.వాసవన్, వి.శివన్కుట్టి, పిఎ మహమ్మద్ రియాజ్, ఐద్వా నేత డాక్టర్ ఆర్.బిందు, గతంలో జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఉన్న వీణా జార్జి, సీపీఐ(ఎం) మద్దతుతో గెలుపొందిన స్వతంత్ర ఎమ్మెల్యే వి.అబ్దు రెహ్మాన్ ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు ఎలమారం కరీం అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కెకె.శైలజ అసెంబ్లీలో పార్టీ విప్‌గా ఉంటారని, కార్మికశాఖ మాజీ మంత్రి టిపి రామకృష్ణన్ పార్లమెంటరీ పార్టీ సెక్రెటరీ పదవిలో ఉంటారని సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో సీపీఐ(ఎం) పేర్కొంది.
నలుగురి పేర్లను ప్రకటించిన సీపీఐ
మంత్రి పదవులు చేపట్టనున్నట్టు సీపీఐ ప్రకటించిన వారిలో జె.చింజు రాణి, కె.రాజన్, జిఆర్.అనిల్, పి.ప్రసాద్ ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవికి సి.గోపకుమార్ పోటీచేయనున్నారు. చింజు రాణి చేరికతో మంత్రివర్గంలో మహిళల సంఖ్య మూడుకు చేరింది. కేరళ చరిత్రలోనే ముగ్గురు మహిళలు మంత్రులుగా ఉండడం ఇదే తొలిసారి. ఎల్డీఎఫ్ కూటమిలో భాగంగా రోషి అగస్టిన్( కేరళ కాంగ్రెస్ ఎం), అహ్మద్ దేవర్కోలి (ఇండియన్ నేషనల్ లీగ్), కె.క్రిష్ణన్కుట్టి (జనతాదళ్), ఎకె.శశీంద్రన్ (ఎన్సీపీ), ఆంటోనీ రాజు( కేరళ కాంగ్రెస్ డెమోక్రటిక్)లు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో విజయన్‌తో సహా మొత్తం సభ్యుల సంఖ్య 21గా ఉంటుంది. వీరిలో విజయన్, మరో ముగ్గురు మినహా మిగిలిన వారందరూ కొత్తవారు.