Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటీసులివ్వకుండానే పడగొట్టారు : ఏఐఎంపీఎల్బీ ఆరోపణ
- కోర్టు ఆదేశాలను పాటించాం : జిల్లా యంత్రాంగం
లక్నో : యూపీలోని బారాబంకిలో గల మసీదును ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే జిల్లా యంత్రాంగం కూల్చిందని ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయంలో న్యాయ విచారణ జరపాల్సిందిగా ఆలిండియా ముస్లిం లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) డిమాండ్ చేసింది. అయితే, జిల్లా యంత్రంగం మాత్రం ఈ విషయంలో కోర్టు ఆదేశాలను పాటించామని చెప్పింది. అక్రమ నిర్మాణమైనందునే కూల్చివేసినట్టు తెలిపింది. రామ్ సనేహీ ఘాట్ మండలంలోని వందేండ్ల చరిత్ర కలిగిన గరీబ్ నవాజ్ మసీదు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే పోలీసుల సమక్షంలో సోమవారం రాత్రి జిల్లా యంత్రాంగం పడగొట్టిందని ఏఐఎంపీల్బీ వర్కింగ్ జనరల్ సెక్రెటరీ మౌలానా ఖాలీద్ సైఫుల్లా రెహ్మాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. '' మసీదు విషయంలో ఎలాంటి వివాదం లేదు. సున్నీ వక్ఫ్ బోర్డు జాబితాలో ఇది ఉన్నది. ఈ విషయంలో సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత న్యాయవిచారణ జరపాలి. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలి. శిధిలాల తొలగింపు ప్రక్రియను ఆపాలి. ఆ వివాదాస్పద ప్రదేశంలో మరే ఇతర నిర్మాణాన్ని చేపట్టడానికి అనుమతించొద్దు'' అని ఆయన డిమాండ్ చేశారు. అయితే, మసీదు అక్రమ కట్టడమని జిల్లా మేజిస్ట్రేటు ఆదర్శ్ సింగ్ వెల్లడించారు. ఈ విషయాన్ని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కూడా నిరూపించిందని చెప్పారు. '' ఈ విషయంలో మార్చిలో నోటీసును జారీ చేశాం. కానీ, వారు నోటీసు అందిన తర్వాత పారిపోయారు'' అని ఆయన చెప్పారు. మసీదు కూల్చివేత ఘటనను యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఖండించింది. అధికార దుర్వినియోగంతో ఇలా చేశారని ఆరోపించింది.