Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయినా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ భారత్ నుంచే అధికం
- ప్రపంచ ఆరోగ్య సంస్థ
న్యూఢిల్లీ : దేశంలో సెకండ్‌వేవ్ బీభత్సం సృష్టిస్తున్న సమయంలో కాస్త ఊరట కలిగించే విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి వినబడింది. దేశంలో నమోదవుతున్న కరోనా కొత్త కేసులు గతవారం నుంచి 13శాతం తగ్గాయి. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా భారత్‌లోనే అధిక సంఖ్యలో కొత్త కేసులుండటం గమనార్హం. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
మే 16 నాటికి ఆయా దేశాల నుంచి ప్రపంచ ఆరోగ్యసంస్థకు అందిన సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా గత వారంలో 48 లక్షల కొత్త కరోనా కేసులు, దాదాపు 86వేల మరణాలు నమోదయ్యాయి. అంటే, కిందటి వారంతో పోల్చుకుంటే కరోనా కేసుల్లో 12 శాతం, మరణాల్లో 5 శాతం తగ్గుదల అన్నమాట. గత వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా మొత్తం కొత్త కేసుల్లో అత్యధికం భారత్ నుంచి 23 లక్షలకు పైగా ఉన్నాయి. అయితే, కిందటివారం నుంచి పోల్చితే ఈ కేసుల సంఖ్య 13 శాతం తగ్గడం గమనార్హం. ఇక భారత్ తర్వాతి స్థానంలో బ్రెజిల్ ( 4.37 లక్షలకు పైగా కొత్త కేసులు, 3శాతం పెరుగుదల), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (2.35 లక్షలకు పైగా కొత్త కేసులు, 21శాతం తగ్గుదల), అర్జెంటీనా (1.51 లక్షలకు పైగా, 8 శాతం పెరుగుదల), కొలంబియా (1.15 లక్షలకు పైగా కొత్త కేసులు, 6 శాతం పెరుగుదల) దేశాలు ఉన్నాయి.