Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా మారణహోమానికి సాక్ష్యంగా పల్లెలు..
- వైరస్‌తో పోరాడే వ్యవస్థలేక గాల్లో కలుస్తున్న ప్రాణాలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు అధికంగా దేశంలోని నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పంజా విసిరిన మహమ్మారి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీంతో గ్రామీణ భారతం కరోనా మారణ హౌమానికి సాక్ష్యంగా నిలుస్తోంది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో కరోనాతో పోరాడటానికి సరైన వ్యవస్థలేదు. ముఖ్యంగా వైద్యారోగ్య వ్యవస్థ మెరుగ్గా లేకపోవడంతో మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న బాసి గ్రామంలోని 5400 మందిలో ముప్పావు వంతు మంది కరోనా సోకింది. వీరిలో 30 మందికి పైగా మరణించారు. దీనికి ప్రధాన కారణం అక్కడ సరైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు లేవు. వైద్యులు లేరు. ఆక్సిజన్ కాన్సిస్టర్లు లేవు. పట్టణ జనాభా మాదిరిగా వీరు సహాయం కోసం సోషల్ మీడియా వేదికగా సహాయం కోసం అభ్యర్థించే అక్షరాస్యత పరిజ్ఞానాన్ని కలిగిలేరు. దీనిపై గ్రామనికి చెందిన వ్యవసాయ సంఘం నేత సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ''ఆక్సిజన్ కొరత కారణంగానే ఈ మరణాలు సంభవించాయి. రోగులను జిల్లా ఆస్పత్రికి తరలించడానికి 4 గంటలకు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది. సకాలంలో వైద్యం అందదు'' అని అన్నారు. ఇలాంటి పరిస్థితులు నేడు ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశం అంతటా ఇలాంటి దృశ్యాలు, ఘటనలు కనిపిస్తున్నాయి. దేశంలోని వివధ ప్రాంతాల్లో గ్రామాధికారులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కార్మికుల కొరత, అంత్యక్రియలు చేయలేని దుస్థితి కారణంగానే నేడు గంగానదిలో మృతదేహాలు దర్శనమిస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం అధికారులు చెబుతున్నదాని కంటే గ్రామాల్లో కరోనా సంక్షోభం అధికంగా ఉంది. గ్రామస్తుల్లో అనేక మంది కరోనా సంబంధిత అనారోగ్యం ఉన్నప్పటికీ ఇండ్లను విడిచి భయటకు రావడానికి భయపడుతున్నారు. దీనికి తోడు కరోనా మరణాల నమోదులోనూ అధికారులు విఫలమయ్యారనీ స్పష్టంగా తెలుస్తోంది. మొదటివేవ్లో కరోనా పంజా విసిరిన తర్వాత కూడా ప్రధాని మోడీ సర్కారు గ్రామీణ భారతంలో వైద్య సౌకర్యాలను మెరుగుపర్చడం కోసం సరైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం స్థానిక అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా కారణంగా ఒకే కుంటుం బంలో ముగ్గురు నలుగురు సభ్యులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత వైరస్ సంక్షోభానికి అద్దం పడుతోంది.
ఈ నెల 14న ప్రధాని మోడీ సైతం ముఖ్యమంత్రుల సమావేశాంలో గ్రామీణ భారతంలో వైరస్ విజృంభణ గురించి ప్రస్తావించడం ప్రస్తుత పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు విఫల మయ్యాయని ఉజ్జయిని ట్రావేల్ కంపెనీకి చెందిన రాజేష్ శర్మ అన్నారు.
''కరోనా ఎదుర్కొవడానికి భారత్‌కు ఏడాది కాలం ఉండింది కానీ వ్యక్తిగత పరపతి, కీర్తి కోసం దేశం నుంచి ఇతరులకు వ్యాక్సిన్లు పంపడం తప్ప పెద్దగా ఏమీ చేయలేదు. ఆస్పత్రుల్లో పడకల్లేవ్, మందుల్లేవ్. ఆక్సిజన్ లేదు. చనిపోండి అంటూ ప్రజలను వదిలేశారు. ఉజ్జయిని లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో గత రెండు వారల్లో మొత్తం కుటుంబంలోని సభ్యులు చనిపోయిన ఘటనలు అనేకం'' ఉన్నాయి అని అన్నారు. ఇక దేశ సరిహద్దు ప్రాంతాల్లోనూ చాలా మంది భయాందోళనకు గురవు తున్నారు.
తమ అనారోగ్యం గురించి చెప్పడం లేదు. దీనికి తోడూ ఆయా ప్రాంతాల్లో మాస్కులు, గ్లౌజులు కూడా. వైద్య సౌకర్యాలు ఏవీ లేవని అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. కుంభమేళ తర్వాత ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాలో అనారోగ్యానికి గురవుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. రిషికేష్, హరిద్వార్ ప్రాంతాల్లో అనారోగ్యం బారినపడని ఇల్లు లేదు అంటూ స్థానికులు చెబుతుండటం అక్కడి ప్రమాదకర పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ ప్రాంతాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలనీ, లేకుంటే భారత్ పెను ప్రమాదంలో పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.