Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గిన డిమాండ్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలు
- మునుముందు మరింత ప్రమాదకరంగా.. : ఆర్థికవేత్తలు, నిపుణులు
న్యూఢిల్లీ: భారత్‌లో అప్పటికే ఆర్థిక మందగమనం, కరోనా ఉధృతి ప్రభావం అన్ని రంగాలపై పడకుండా ముందుచూపుగా మోడీ సర్కారు చర్యలు తీసుకోకపో వడంతో ప్రస్తుతం దేశ ప్రజలకు శాపంగా మారింది. మునుముందు ఆర్థిక, ఆరోగ్య, నిరుద్యోగ సంక్షోభం తలెత్తనుందని ఆర్థికవేత్తలు, నిపుణులు నెత్తినోరు కొట్టుకున్న మోడీ సర్కారు వాటిని పెడచెవిన పెట్టడంతో నేడు భారత్‌లో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఒకవైపు ఉపాధి కరువై నిరుద్యోగం పెరుగుతుండగా.. మరోవైపు తగ్గిన డిమాండ్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. రాబోయే కాలంలో ఈ పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని ఆర్థికవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉపాధి పొందిన వారి సంఖ్య 40 కోట్ల నుంచి 39 కోట్లుకు పడిపోయింది. అంటే కోటి మంది ఉద్యోగాలు ఊడాయి. ఎన్నడూ లేనంతగా ఈ నాలుగు నెలల్లో రికార్డు స్థాయిలో ప్రజలు ఉపాధిని కోల్పోయారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా అంచనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సీఎంఐఈ గణాంకాల ప్రకారం.. దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగు తోంది. ప్రస్తుతం నిరుద్యోగిత రేటు 9.5 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 11.4 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 8.6 శాతంగా, ఉంది. ఈ ఏడాది జనవరిలో ఇది 6.52 శాతంగా ఉండగా, ఏప్రిల్‌లో 7.97 శాతంగా ఉంది. అయితే, ఒక్క వ్యవసాయ రంగంలోనే జనవరిలో ఉపాధి డిమాండ్ ఉన్నప్పటికీ.. తర్వాతి కాలంలో రబీ పంట కోతలు పూర్తి కావడంతో ఉపాధి కరువైంది. మిగిలిన రంగాల్లో ఉపాధి కల్పన పెద్దగా రికవరీని చూపించలేదు. వాస్తవానికి గత రెండు సంవత్సరాల నుంచి ఉపాధి కరువై నిరుద్యోగం పెరగడం, కుటుంబాల ఆర్థిక పరస్థితులు మరింతగా దిగజారడంతో జీవన ప్రమాణాలు భారీగా పడిపోయాయి. వేతన స్థాయిలపై ప్రభావం అధికంగానే ఉంది.
కరోనా నేపథ్యంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పెట్టాయి. ఈ ఆంక్షలు సైతం ఉపాధి, నిరుద్యోగం, ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎందుకంటే దేశంలో ఆధిక వాటా జనాభా అనధికార రంగంలోనే ఉపాధిని పొందుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 3.4 కోట్ల మంది నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని సీఎంఐఈ అంచనాలు చెబుతున్నాయి. ఉద్యోగాలు పొందడం కష్టమని యాక్టివ్‌గా లేనివారు 1.9 కోట్ల మంది ఉన్నారు. అంటే మొత్తంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న నిరుద్యోగులు 5.3 కోట్ల మందికి పైగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ సంఖ్య అధికంగానే ఉంది.
ఆర్థిక వ్యవస్థ కుదేలు.. కరోనా కంటే ముందే..
దేశ ఆర్థిక వ్యవస్థ గతేడాది విధించిన లాక్డౌన్ తర్వాత ఇప్పటివరకు పెద్దగా కోలుకోలేదు. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారికి ముందే (2019) భారత్ వ్యవస్థ ఆర్థిక మందగమనంలోకి జారుకుంది. ఈ క్రమంలో ఆర్థిక వృద్ధి చర్యలను వేగవంతం చేయడం కోసం మోడీ సర్కారు సైతం పెద్దగా మెరుగైన చర్యలు తీసుకోకపోవడంతో తీవ ప్రభావం పడిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదివరకు ప్రకటించిన ఆర్థిక వృద్ధి గణాంకాలను దాదాపు అన్ని రేటింగ్ సంస్థలు తగ్గించాయి.
రాబోయే కాలంలో మరింత ప్రమాదకరంగా..
వేతన జీవులు సహా అందరిలో పెరుగుతున్న నిరుద్యోగం, వాస్తవాదాయాలు కుంచించుకుపోవడం వంటి పరిస్థితులు డిమాండ్ తగ్గడానికి దారి తీశాయనీ, ఇవి ఆర్థిక వ్యవస్థకు మంచి శకునాలు కావని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ అన్నారు. పెరుగుతున్న నిరుద్యోగమనేది ఆర్థిక వ్యవస్థకు శుభ శకునం కాదనీ, గతేడాది లాక్డౌన్ సడలించిన తర్వాత కార్మిక ప్రాతినిధ్యం రేటు కోలుకుంది కానీ, ఊపందుకోవడం లేదన్నారు. ఆదాయాలు, వినియోగదారుని సెంటిమెంట్ రెండూ దెబ్బతిన్నాయన్నారు. దాదాపు 90శాతం కుటుంబాలు ఆదాయాల కొరతను ఎదుర్కొంటున్నా యన్నారు. ఏప్రిల్‌లో లేబర్ మార్కెట్లు దెబ్బతినడానికి పాక్షికంగా విధించిన లాక్డౌన్లు కారణం కాదనీ, ప్రధానంగా పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించలేక పోవడమేనని అన్నారు. పలు రంగాల్లో సామర్ధ్య వినినయోగమనేది చాలా తక్కువగా వుందని అన్నారు. ఇటువంటి తరుణంలో డిమాండ్‌ను పునరుద్ధరించే విధానపరమైన చర్యలు తీసుకోవడం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.