Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో 45మంది మృతి
- ప్రధాని మోడీ ఏరియల్ సర్వే
- ముంబయిలో గల్లంతైన నౌకలో 22 మంది జలసమాధి
- తూర్పు తీరానికి మరో తుఫాను ముప్పు
అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో బీభత్సంతో 'తౌక్టే' అతి తీవ్ర తుఫానుగా గుజరాత్‌ను అతలాకుతలం చేసింది. భారీగా ప్రాణ నష్టం కలిగించింది. ఈ తుఫాను ప్రభావంతో 12 జిల్లాల పరిధిలో సుమారు 45మంది చనిపోయినట్టు అధికారులు వెల్ల డించారు. సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి జిల్లాలోనే 15 మంది మృతిచెందారు. గుజరాత్‌లోని దీవ్-ఉనా మధ్య తుఫాను తీరాన్ని దాటిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించిన విషయం తెలిసిందే. భావ్‌నగర్, గిర్ సోమనాథ్ కోస్టల్ జిల్లాల్లో ఎనిమిది మంది
చొప్పున చనిపోయారని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారులు వెల్లడించారు. అహ్మదాబాద్‌లో ఐదుగురు, ఖేడాలో ఇద్దరు, ఆనంద్, వడోదర, సూరత్, వల్సాద్, రాజ్‌కోట్, నవ్‌సరి, పంచమహల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. గుజరాత్, డామన్ డయ్యూలలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. తౌక్టేతో సంభవించిన నష్టాన్ని అంచనా వేశారు. ఈ పెను తుపాను ప్రభావానికి గురైన రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని తెలిపారు.
నౌక గల్లంతు..22 మంది మృతి
'తౌక్టే' తుఫాను ధాటికి మహారాష్ట్రలోని ముంబయి హై ప్రాంతంలో భారీ నౌకలు అరేబియా సముద్రంలో కొట్టుకుపోయిన ఘటనలో 22 మంది మృతదేహాలను నౌకాదళ సిబ్బంది బుధవారం గుర్తించి తీరానికి తెచ్చారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతున్నది.
తుఫాను ఉధృతికి బాంబే హై ప్రాంతంలో ఓఎన్జీసీ చమురుక్షేత్రం వద్ద పి-305 అనే భారీ నౌక లంగరు ఊడిపోయి సముద్రంలో కొట్టుకుపోయింది. సమాచారమందుకున్న నేవీ హుటాహుటిన యుద్ధనౌకలను రంగంలోకి దింపి సహాయకచర్యలు చేపట్టింది. అయితే తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ నౌక నీటిలో మునిగిపోయి కన్పించింది. ప్రమాదం సమయంలో నౌకలో 261 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నౌక నుంచి ఇప్పటివరకు 185 మందిని నౌకదళ సహాయకసిబ్బంది రక్షించి ఒడ్డుకు చేర్చగా.. బుధవారం 22 మంది మృతదేహాలను గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించి, రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
మోడీజీ.. మహారాష్ట్రను సందర్శించరేం?: ఎన్సీపీ
తౌక్టే బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన మహారాష్ట్రలోని ప్రాంతాలను ప్రధాని ఎందుకు సందర్శించడంలేదని ఎన్సీపీ ప్రశ్నించింది. గుజరాత్, డామన్ డయ్యూలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మోడీ ఏరియల్ సర్వే చేస్తుండటంపై ఎన్సీపీ జాతీయ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ట్విటర్లో స్పందించారు. తమ పొరుగు రాష్ట్రాలను సందర్శించి మహారాష్ట్రలో పర్యటించకపోవడం వివక్ష కాదా అని ఆయన ప్రశ్నించారు.
పొంచిఉన్న మరోముప్పు
తౌక్టే తుఫాను నుంచి కోలుకోకముందే.. మరో ముప్పు పొంచి చూస్తోంది. 26-27 తేదీల్లో ఇంకో తుఫాను తూర్పు తీరాన్ని తాకే అవకాశమున్నట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బుధవారం వెల్లడించింది. 22న ఉత్తర అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు తెలిపింది. ''అల్పపీడనం ఏర్పడిన 72 గంటల్లో అది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశముంది. అది వాయువ్య దిశగా కదులుతూ 26 నాటికి పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను తాకే అవకాశమున్నది'' ఐఎండీ తుఫాను హెచ్చరికల విభాగం వెల్లడించింది.