Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో ఒకవైపు వైరస్ విజృంభణ..
- మరోవైపు వైరస్ రహిత దేశంగా చైనా
- మహమ్మారి కట్టడికి విభిన్న వ్యూహాలు అమలు
- దేశ ప్రజలందరికీ త్వరితగతిన వ్యాక్సినేషన్
- 'కరోనా ఫ్రీ' జాబితాలో భూటాన్, న్యూజిలాండ్ కూడా
స్రవంతి
ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ (రెండో దశ కరోనా ఉదృతి) కొనసాగుతున్నది. ముఖానికి మాస్క్, భౌతిక దూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే, కొన్ని దేశాల్లో మాస్క్ ధారణ, భౌతిక దూరం వంటి నిబంధనలను ఎత్తేశారు. దీంతో ఆయా దేశాల్లోని ప్రజలు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. దీనికి కారణం అక్కడ కరోనాను దాదాపుగా కట్టడి చేయడమే. 'కరోనా ఫ్రీ' దేశాలుగా పిలుస్తున్న వాటి విశేషాలు ఇవే..
చైనా-కరోనా కాటుకు విలవిల్లాడిన తొలి దేశం చైనా. విదేశాలు ఆపన్న హస్తం అందించకపోయినా.. వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోయినా మహమ్మారి కట్టడికి అహర్నిశలు శ్రమించింది. పెద్దఎత్తున పరీక్షల నిర్వహణ, కాంటాక్ట్ ట్రేసింగ్, ఎక్కడికక్కడ ఐసోలేషన్ వంటి విభిన్న వ్యూహాలతో కరోనా పీచమణిచింది. ఇప్పుడు దేశంలో దాదాపుగా అందరూ టీకాలు వేసుకున్నారు. మాస్క్ నిబంధనలు లేవు.
భూటాన్- కేవలం రెండు వారాల్లోనే దేశంలోని 90 శాతం మందికి టీకాలు వేసిన దేశంగా భూటాన్ రికార్డులకెక్కింది. కరోనా కల్లోలం సృష్టించిన భారత్, చైనా సరిహద్దులుగా ఉన్నప్పటికీ, లాక్ డౌన్ విధించకుండానే.. మహమ్మారి విజృంభణను పటిష్టంగా కట్టడి చేసింది. దీంతో కరోనా కారణంగా ఒక్కటంటే ఒక్క మరణమే నమోదైంది. దీంతో ఆంక్షలు ఎత్తేశారు.
అమెరికా- కరోనాతో చిగురుటాకులా వణికిన దేశం అమెరికా. వీధుల్లో కరోనా మృతదేహాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన రోజులు ఇప్పటికీ గుర్తే. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, ధనిక దేశం కావడంతో ఎక్కువ మోతాదులో డోసులను కొనుగోలు చేయడంతో వ్యాక్సినేషన్ ఊపందుకుంది. దీంతో వైరస్ కట్టడి జరిగింది. ఇప్పుడు మాస్క్ నిబంధనలు ఎత్తేశారు.
న్యూజిలాండ్-కరోనా మొదలైనప్పటి నుంచి పటిష్టమైన చర్యలు తీసుకున్న దేశాల్లో ముందు వరుసలో ఉంటుంది న్యూజిలాండ్. ఇప్పటివరకూ వైరస్ తో అక్కడ కేవలం 26 మందే మరణించారంటే అర్థం చేసుకోవచ్చు. మహమ్మారి నియంత్రణ చర్యలపై వేగవంతమైన నిర్ణయాలు, వ్యాక్సినేషన్ మంచి ఫలితాలు ఇచ్చాయి. ఇటీవలే 50 వేల మందితో ఓ సంగీత విభావరి నిర్వహించడం అందర్నీ ఆకర్షించింది.
ఇజ్రాయెల్- ప్రపంచంలో తొలి కరోనా రహిత దేశం తమదేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. పరీక్షల సంఖ్యను ఎప్పటికప్పుడు పెంచడం, దేశంలో 70 శాతం మందికి పైగా టీకాలు వేయడం తదితర చర్యలతో మహమ్మారిని కట్టడి చేశారు. దీంతో ముఖానికి మాస్క్, భౌతిక దూరం వంటి నిబంధనలను ఎత్తేశారు. ఇప్పుడు అక్కడి ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నారు.