Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచవ్యాప్తంగా అంతర్గత నిరాశ్రయుల సంఖ్య
- పదేండ్లలో ఇదే అత్యధికం : ఐడీఎంసీ
న్యూఢిల్లీ : సంఘర్షణలు, ప్రకృతి విపత్తుల వంటి పలు కారణాలతో గతేడాది ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు తమ ఇండ్లు, ప్రదేశాలను విడిచిపెట్టి తమ దేశంలోని మరొక చోటుకు పారిపోయారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అంతర్గత నిరాశ్రయుల సంఖ్య కొత్త రికార్డును నమోదు చేసిందని మానిటర్స్ వెల్లడించింది. తీవ్రమైన తుఫానులు, నిరంతర ఘర్షణలు, పేలుళ్లు, హింస వంటి పలు కారణాల వల్ల గతేడాది 4.05 కోట్ల మంది ప్రజలు తమ దేశాల్లో నిరాశ్రయులయ్యారు. అయితే, ఈ విధంగా నిరాశ్రయులైన వారి సంఖ్య గత దశాబ్దకాలంలో అత్యధికం కావడం గమనార్హం. దీంతో అంతర్గ నిరాశ్రయుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్లకు చేరుకున్నదని ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ (ఐడీఎంసీ), ద నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ (ఎన్నార్సీ) ల సంయుక్త నివేదిక వెల్లడించింది. ఒకపక్క, ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై పోరాడుతూ కోవిడ్-19 ఆంక్షలు ఉన్న సమయంలోనే ఈ సంఖ్య కొత్త రికార్డును నమోదు చేయడం గమనార్హం. నిజానికి, ఈ ఏడాదిలోనే అంతర్గత నిరాశ్రయుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తగ్గుతుందని విశ్లేషకులు భావించారు. కానీ, వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ వారి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది. అంతర్గత నిరాశ్రయుల సంఖ్య అనేది సరిహద్దుల గుండా వెళ్లిన శరణార్థుల సంఖ్య 2.6 కోట్ల కంటే అధికంగా (రెట్టింపు స్థాయిలో) ఉండటం గమనార్హం.
గతేడాది నిరాశ్రయులైనవారి సంఖ్య, మొత్తం నిరాశ్రయుల సంఖ్య రెండూ అధికమేనని ఐడీఎంసీ డైరెక్టర్ అలెక్జాండ్ర బిలాక్ తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇంత సంఖ్యలో పెరుగుదల లేదని చెప్పారు. అంతర్గత నిరాశ్రయుల సంఖ్య అధికంగానే ఉండొచ్చనీ, కరోనా మహమ్మారి ఆంక్షల కారణంగా సమాచార సేకరణకు ఆటంకం ఏర్పడిందని బిలాక్ తెలిపారు. ప్రజలు తమ దేశంలోని నిరాశ్రయులగా మారడమనే అంశం ఆశ్చర్యకరమని ఎన్నార్సీ చీఫ్ జాన్ ఎగిలాండ్ ఒక ప్రకటనలో చెప్పారు.