Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ: 2021-22 ఆర్ధిక సంవత్సరపు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నేలను విడిచి సాము చేసింది. అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక వనరులు ఏమాత్రం పెరిగే అవకాశం లేకపోయినా కేటాయింపులను భారీగా చూపింది. వస్తాయో, రావో తెలియని కేంద్ర నిధులపై భారీ ఆశలు పెట్టుకోవడంతో పాటు, అప్పులపైనా ఎనలేని మక్కువ చూపింది. కరోనా విజృంభణతో రాష్ట్రంలోనూ, దేశ వ్మాప్తంగానూ నెలకొన్న దుర్భర పరిస్థితులను విస్మరించి తాను స్వయంగా భ్రమల్లో మునిగిపోవడంతో పాటు, ప్రజలనూ ముంచే ప్రయత్నం చేసింది. 2,29,779.27 కోట్ల రూపాయల అంచనాతో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాధ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఖచ్చితంగా ఖజానాకు చేరే సొంత వనరుల ఆదాయం స్వల్పమే! మిగిలిన మొత్తంకోసం అప్పులు, గ్రాంట్లపై ఆధారపడింది. పన్నుల ద్వారా ఈ ఏడాది రాష్ట్ర ఖజానాకు 85,280 కోట్ల రూపాయలు జమ అవుతాయని అంచనా వేశారు. గత ఏడాది ఈ మొత్తాన్ని 70,629 కోట్ల రూపాయలుగా అంచనా వేయగా, 57 వేల కోట్లే ఖజానాకు చేరాయి. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సవరించిన అంచానాల్లో పేర్కొంది. పరిస్థితుల్లో ఏం మార్పు వస్తుందని ఊహించారో కానీ దాదాపు 28 వేల కోట్ల రూపాయలు అదనంగా పన్నుల రూపంలో వస్తాయని తాజాగా పేర్కొన్నారు. వివిధ గ్రాంట్ల రూపంలో ఖజానాకు 2019-20 సంవత్సరంలో 21.87 వేల కోట్ల రూపాయలు జమకాగా గత ఆర్థిక సంవత్సరపు సవరించిన అంచనాల్లో 32.93 వేల కోట్ల రూపాయలు వచ్చినట్లు చూపారు. తుది లెక్కలు తేలితే కానీ, దీనిలో వాస్తవమెంతో స్పష్టం కాదు. ఈ ఏడాది గ్రాంట్ల రూపంలో వచ్చే మొత్తం 57.93 వేల కోట్ల రూపాయలకు చేరింది. ఈ స్థాయిలో అంచానాలు పెరగడానికి కారణమేమిటో ఆర్థికమంత్రి తన సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా వివరించలేదు. దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు కారణంగా రుణం ఇవ్వడానికి ఆర్థిక సంస్థలు వెనుకాడుతున్నప్పటికీ దాదాపుగా 50 వేల కోట్ల రూపాయలను అప్పుగా సేకరిస్తామని పేర్కొన్నారు. ఇలా దాదాపుగా 70 వేల కోట్ల రూపాయలు అదనపు (వస్తుందో, రాదో తెలియని) ఆదాయంను చూపిన రాష్ట్ర ప్రభుత్వం 48 వేల కోట్ల రూపాయల నగదు బదిలీ పథకాలను బడ్జెట్లో చూపింది. దీనిలోనే అట్టహాసంగా చెప్పుకుంటున్న సబ్‌ప్లానులు, జెండర్, చిల్డ్రన్ బడ్జెట్లకు నిధులు కేటాయించింది. ఆశించిన స్థాయిలో నిధులు రాకపోతే ఖజానాను నింపుకోవడానికి పన్ను పోటు తప్పని స్థితి నెలకొంది. అదే జరిగితే కష్టకాలంలోనూ ప్రజల నెత్తిన పిడుగులు పడ్డటే! వ్యవసాయ రంగంలో కీలకమైన మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌కు నిధులు కోత పెట్టింది. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాటల్లోనే గత ఏడాది కోవిడ్‌పై పోరాటానికి 2వేల కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేయగా, ఈ ఏడాది వెయ్యి కోట్ల రూపాయలతో సరిపెట్టారు. దానిలో 500 కోట్లు వ్యాక్సినేషన్‌కు! అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌తో పాటు, కరోనా విజృంభణను ఎదుర్కోవడానికి ఈ మొత్తం ఎలా చాలుతుందో అర్థం కాని స్థితి. చట్టసభల్లో ఏకైక ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ బహిష్కరించడంతో ఏకపక్షంగా శాసనసభ సమావేశం జరిగింది. మండలిలో పిడిఎఫ్ సభ్యులు నిలదీసినప్పటికీ ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంభించి బడ్జెట్‌ను ఆమోదింపచేసుకుంది.