Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవలం ఆరోగ్య సమస్య కాదు ఆకలి సమస్య కూడానూ..
- మీడియా, ప్రపంచ దాతల దృష్టంతా ఆక్సిజన్‌పైనే..
- దేశంలో పెరుగుతున్న ఆకలిమంటలు, పేదరికం
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ తీవ్ర స్థాయిలో పంజా విసురుతోంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న దయనీయ పరస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు, అనేక సంస్థలు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్లు, ఉత్పత్తిప్లాంట్లు, సహా ఇతర వైద్య సామాగ్రి సహాయం అధికంగా ఉంది. ప్రస్తుతం మీడియా, దాతల దృష్టంతా కూడా వీటిపైనే ఉంది. ఎందుకంటే కనీస వైద్య సౌకర్యాలు అందక ప్రాణాలు కోల్పోతున్న వారికి సంబంధించిన విషయాలు సర్వత్రా హైలెట్ చేయబడ్డాయి. అయితే, దేశంలో నేడు కేవలం ఇలాంటి మరణాలే కాకుండా ఆకలి మంటలు, పేదరికం, ఆర్థిక అసమానతలు, జీవనోపాధి లేకపోవడం వల్ల ప్రాణనష్టం భారీగానే చోటుచేసుకుంటోంది.
నేడు ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి అనేక ఎన్జీవోలు ముందుకు సాగుతున్నా.. అవి నిధుల సేకరణ కోసం కష్టపడుతున్నాయి.
గతేడాది వెలుగుచూసిన కరోనా ఫస్ట్‌వేవ్ కారణంగా దేశంలో చాలా మంది పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. మార్చి 2020 నుంచి 2020 అక్టోబర్ వరకు దారిద్య్రరేఖ దిగువకు జారుకున్న వారి సంఖ్య 23 కోట్లు పెరిగింది. దాదాపు 90 శాతం గృహల్లో తినడానికి తిండిలేని పరిస్థితులు దాపురించాయి. ఇదిలా కొనసాగుతున్న తరుణంలోనే కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో సమస్య మరింత తీవ్రమైంది. ప్రస్తుతం దేశంలోని 700లకు పైగా జిల్లాల్లో 533లో 10 శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉంది. అలాగే, 42 శాతం జిల్లాలు జాతీయ సగటు 21 శాతం కంటే అధికంగా పాజిటివిటీ రేటును కలిగివున్నాయి.
ఆక్సిజన్‌కు దాతల నిధులు
కరోనా నిధుల సేకరణ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన గివ్ఇండియా కరోనా సంక్షోభ మొదటి మూడు వారాల్లో ఐసీఆర్ఎఫ్-2కు రూ.240 కోట్లను సేకరించింది. అలాగే, వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా దీనికి కోటి రూపాయల సాయం అందించారు. దీనిని గివ్ఇండియా 20 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 14 వేల ఆక్సిజన్ సిలిండర్లును ఢిల్లీ, బెంగుళూరులకు అందించడానికి ఖర్చు చేసింది. ఇలాగే భారత్ 38 దేశాల నుంచి వైద్య సామగ్రికి సంబంధించి సాయం పొందింది. అనేక సేవా సంస్థలకు నిధుల సేకరణ వైద్య సామగ్రిలో అందుతోంది. దాతల ప్రాధాన్యత కూడా అదే విధంగా ఉంటోంది.
ఆకలి సమస్య
అయితే, ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో వైద్య సామగ్రి సాయం ఒక్కటే ప్రజలను కాపాడుతుందా? అంటే స్పష్టంగా కాదనే చెబుతున్నారు విశ్లేషకులు. గూంజ్ వ్యవస్థాపకుడు అన్షు గుప్తా మాట్లాడుతూ.. ''మేము, మా కుటుంబాలు, సంఘాలు ప్రస్తుతం ఆక్సిజన్ సహాయం, ఇతర వైద్య సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఆస్పత్రుల ముందు ఆహారంలేక ఎంతో మంది చనిపోతున్నారు. ప్రస్తుతం ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం రోజువారీ కూలీలు, అసంఘటిత వేతన జీవుల పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి'' అని అన్నారు. ఇది కేవలం ఆరోగ్య సమస్య కాదు ఆకలి సమస్య అని గుర్తించాల్సి ఉందని తెలిపారు. దేశంలో అంతర్జాతీయంగా దాతల సాయం పొందుతున్న సేవా సంస్థల్లో ప్రస్తుతం ఆహారం, రేషన్ సంబంధిత డిమాండ్ అధికంగా ఉందని 71 శాతం ఎన్జీవోలు పేర్కొన్నాయి. టీకాల అవగాహన మద్దతు కోసం సగం, 29 శాతం మాత్రమే ఆక్సిజన్, వైద్య సామగ్రిని అందించడానికి నిధులు కోరాయి. మానసిక ఆరోగ్యం, అన్లైన్ మెడికల్ కౌన్సిలింగ్ సహా ఇతర అంశాలకు సంబంధించి 35 శాతం కోరాయి. అంటే దేశంలో ఆహారం, సామాజిక భద్రత, జీవనోపాధి పునరుద్ధరణ, పరీక్షలు, టీకాల అవశ్యకతను తెలియజేస్తున్నాయి.