Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాన్సెట్ ఎడిటోరియల్‌పై బీజేపీ తప్పుడు ప్రచారాలు
- లోపభూయిష్టమైన ప్రకటనలతో అపకీర్తి
- కరోనా వ్యాప్తిలో భారత్ వైఫల్యాలపై కథనం
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో విఫలమైన మోడీ సర్కారు తీరును విమర్శిస్తూ ఇటీవల ది లాన్సెట్ మెడికల్ జర్నల్ ఒక సంపాదకీయాన్ని ప్రచురించింది. ఈ సంపాదకీయానికి ముందే దేశంలోని పలు నివేదికలు, పత్రికలు సైతం ఇలాంటి కథనాలనే ప్రచురితం చేశాయి. అయితే, బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు మాత్రం లాన్సెట్ ఎడిటోరియల్‌ను తప్పుబడుతున్నారు. ఇదంతా అవాస్తవం, పూర్తిగా కల్పితమని ఆరోపణలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ మోడీ సర్కారును వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ క్రమంలో అసత్య కథనాలతో ప్రజలలో వారు అపకీర్తిని మూటగట్టుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.
'' యూఎస్, యూరప్, బ్రెజిల్ జనాభా కంటే భారత్ జనాభా ఎక్కువ. నేటికీ, భారత్‌లో మిలియన్ జనాభాకు మరణాల సంఖ్య యూఎస్, యూకే, బ్రెజిల్ దేశాల్లో కంటే 10 శాతం కన్నా తక్కువ'' అని బీజేపీ నాయకుల ప్రచారాల్లో ఇదీ ఒకటి.
అయితే, భారత్‌లోని కరోనా కేసులు, మరణాల సంఖ్యలను ఇతర దేశాలతో పోల్చలేమని నిపుణులు అన్నారు. ఎందుకంటే, భారత్‌లో నమోదయ్యే కేసులు రెండు విధాలుగా నివేదించబడ్డాయని చెప్పారు. '' ఒకటి మౌలిక సదుపాయాలు లేకపోవడం. రెండు, ప్రభుత్వ స్థాయిలో లోపాల కారణంగా అండర్ టెస్టింగ్'' అని వైద్య నిపుణులు తెలిపారు. అయితే, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలైన యూఎస్, యూకే వంటి దేశాల్లో ఇలాంటి పరిస్థితులు భారత్‌తో పోలిస్తే తక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఇటు భారత్‌లో నమోదవుతున్న కరోనా మరణాల విషయంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ విషయంపై పాట్నా హైకోర్టు కూడా సమస్యలను ఎత్తి చూపింది. పలు కోర్టులు, మీడియా నివేదికలు సైతం కరోనా మరణాలు విషయంలో అనుమానాలను లేవనెత్తుతూ వాస్తవాలను బయటకు తీసుకొచ్చాయి. '' ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 10 మధ్య గుజరాత్ ప్రభుత్వం 4,128 కరోనా మరణాలను నమోదు చేసింది. కానీ, రాష్ట్రంలో 1.23 లక్షల మరణ ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయి'' అని హిందూస్తాన్ టైమ్స్ నివేదించడం గమనార్హం.
ఇక దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌కు ఢిల్లీలో రైతుల నిరసనలే కారణమంటూ ప్రచారాలు చేస్తూ లాన్సెట్ ఎడిటోరియల్‌ను బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే, రైతుల నిరసనలను పక్కనబెడితే.. ముఖ్యంగా కుంభమేళ, ఐదు రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ నాయకులు మర్చిపోవడం గమనార్హమని రాజకీయ నిపుణులు అన్నారు.
'' రైతు నిరసలకు రెండు లక్షల మంది హాజరయ్యారు. అయితే, కుంభమేళకు దేశవ్యాప్తంగా 91 లక్షల మంది వచ్చారు. అయితే, కరోనా సెకండ్‌వేవ్‌లో దేశంలో కొత్త కేసుల నమోదుకు ఏ కార్యక్రమం ఊతమిచ్చిందో అనే విషయాన్ని తెలిసి కూడా నటించడం బీజేపీ నాయకులకే చెందుతుంది'' అని విశ్లేషకులు వివరించారు. 2022 లో షెడ్యూల్ చేయబడిన కుంభమేళను బీజేపీ జాతీయ నాయకత్వం జ్యోతిష్కుల మాట మీద ఒక సంవత్సరం ముందుకు తీసుకొచ్చి 2021లో నిర్వహించడం గమనించాల్సిన అంశమని చెప్పారు. ఇక అధికార దాహంతో (ముఖ్యంగా పశ్చిబెంగాల్‌లో అధికారం కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి భారీ ర్యాలీలతో ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలు హౌరెత్తించారు) బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలను ఆ పార్టీ నాయకులు వెనకేసుకురావడం వారి అవివేకానికి అద్దంపడుతున్నదని తెలిపారు.
ఇక దేశంలోని మీడియా పైనా బీజేపీ నాయకుల ఆరోపణలు ఆశ్చర్యం కలిగించక మానవు. '' మీడియా రిపోర్టింగ్ ప్రజల మనస్సుల్లో భయాన్ని రేకెత్తిస్తున్నది. మందులు, ఆక్సిజన్ పరికరాలను నిల్వ చేయడానికి వారిని ప్రేరేపిస్తున్నది. దీంతో ఈ సామాగ్రికి డిమాండ్ పెరిగి బ్లాక్ మార్కెట్‌కు ఊతమిస్తున్నది'' అని వారు చేస్తున్న ప్రచారం.
అయితే, ప్రజల్లో ఉన్న భయాన్ని ఆసరాగా చేసుకొని బ్లాక్ మార్కెట్ పడగవిప్పుతున్నదని వైద్య, రాజకీయ నిపుణులు అన్నారు. అలాంటప్పుడు ప్రజల్లో భయాన్ని, గందరగోళాన్ని తగ్గించాలి కానీ, మీడియా స్వేచ్ఛను అడ్డుకోవాలనుకోవడం సరికాదని చెప్పారు. చికిత్స ప్రోటోకాల్‌ను హేతుబద్దీకరించాలి. మందుల ధరలను, పంపిణీని నియంత్రించాలని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే బ్లాక్ మార్కెట్ దానంతటికదే నశించిపోతుందని తెలిపారు.
ప్రతి విషయాన్ని సోషల్‌మీడియా అతి చేసి చూపిస్తున్నదనీ, ఇటు పాశ్చాత్య మీడియా సైతం ఇదే విధంగా వ్యవహరిస్తూ తమ దేశాల్లో కరోనా వ్యాప్తికి సంబంధించిన విషయాలను మాత్రం చూపెట్టలేదని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు.
గతేడాది న్యూయార్క్‌లో కోవిడ్-19 కారణంగా మరణాలు పెరగడంతో రాయిటర్స్, వాషింగ్టన్ పోస్ట్, సీఎన్ఎన్, న్యూయార్క్‌టైమ్స్, బీబీసీ, ది టెలిగ్రాఫ్ లు మృతదేహాల సామూహిక ఖననానికి సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ లను టెలికాస్ట్ చేసిన విషయాన్ని విశ్లేషకలు, పలువురు మీడియా ప్రముఖులు ఈ సందర్బంగా గుర్తు చేశారు.
ఇలాంటి విషయాల్లో జర్నలిస్టులు, సంస్థలపై నమ్మకాన్ని కలిగి ఉండకపోవడం, ప్రపంచ విషయాలను క్షుణ్ణంగా పరిశీలించకపోవడం బీజేపీ నాయకుల లోపమని చెప్పారు. ఇక సోషల్‌మీడియాలోనూ ఇప్పటికే అనేక కఠిన నిబంధనలు ఉన్నాయనీ, వాటిలో వచ్చే ప్రతి ఒక్క విషయమూ అవాస్తవమని కొట్టి పారేయలేమని చెప్పారు.