Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘీభావంగా ఆందోళనలకు ప్రజాసంఘాల పిలుపు
న్యూఢిల్లీ : మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఉద్యమం ప్రారంభించి ఆరు నెలలు కావస్తున్న నేపథ్యంలో ఈ నెల 26న ''బ్లాక్ డే'' నిర్వహించాలన్న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునకు అపూర్వ మద్దతు లభిస్తోంది. ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐలు కిసాన్ మోర్చా బ్లాక్ డే పిలుపునకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ మేరకు గురువారం ఆయా సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాలిని భట్టాచార్య, మరియం ధావలే (ఐద్వా), మహ్మద్ రియాజ్, అవరు ముఖర్జీ (డీవైఎఫ్ఐ), విపి సాను, మయూక్ బిశ్వాస్ (ఎస్ఎఫ్ఐ) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.
నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న నల్ల జెండాలు తమ ఇండ్లపైన, వాహనాలపైన ఎగురవేయాలనీ, మోడీ దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. పీఎం కేర్స్ నిధులను ఆక్సిజన్, వెంటిలేటర్లు, మెడిసిన్, ఆస్పత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేసేందుకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ విస్టా పనులను నిలిపివేసి, వైద్య అవసరాలకు కేటాయించాలని కోరారు.
ఉచితంగా అందరికీ కరోనా వైద్యం అందించాలని, వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రయివేట్ ఆస్పత్రులను కఠినంగా నియంత్రించాలని కోరారు. ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి భారీగా నిధులను కేటాయించాలనీ, ప్రతి కుటుంబానికి రూ.7,500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీడీఎస్ ద్వారా పప్పుధాన్యాలు, నూనె, చక్కెర మొదలైన వస్తువులతో పాటు, ఆరు నెలల పాటు 10 కేజీల ఆహార ధాన్యాలు ఇవ్వాలని సూచించారు. ఉపాధిహామీ వేతనాలు పెంచాలనీ, పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తగిన పరిహారం, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెమిస్టర్ ఫీజుతో సహా అన్ని ఫీజులను రద్దు చేయాలని, అన్ని విద్యా సౌకర్యాలు, అవసరమైన ఇంటర్నెట్ సేవలను పేద, సామాజికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులందరికీ ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.
పది జాతీయ కార్మిక సంఘాల మద్దతు
బ్లాక్ డేగా ఈ నెల 26న పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపునకు పది జాతీయ కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. నాలుగు లేబర్ కోడ్లు ఉపసంహరించుకోవాలని, వెంటనే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని, ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ విధానాన్ని ఆపాలని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మద్దతు తెలిపిన సంఘాల్లో సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యుఎ, ఏఐసీసీటీయూ, ఎల్పిఎఫ్, యూటీయూసీ తదితర సంఘాలున్నాయి. ఇప్పటికే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఎడబ్ల్యూయూ) మద్దతు తెలిపింది.
జోరు వర్షంలో... చలిలో రైతుల ఆందోళన
జోరు వర్షం పడినప్పటికీ ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం కొనసాగింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో రైతుల వేసుకున్న టెంట్లన్నీ పూర్తిగా తడిచిముద్దయ్యాయి. దుప్పట్లు, బెడ్లు తడిచిపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు గురయ్యారు. రోడ్డుపైన, గుడారాల్లో నీరు నిలిచిపోయింది. నిద్రించేందుకు అవకాశం లేకపోవడంతో బుధవారం రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. తీవ్రమైన చలితో వణిపోతూ అలానే రాత్రంతా గడిపారు. గురువారం కూడా వర్షం భారీగా పడటంతో తడిచిన బట్టలతోనే ఉన్నారు. అయినా మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి వర్షం, చలి సమస్యలు తమ లక్ష్యం ముందు ఏపాటివని రైతు నేత బల్బీర్ సింగ్ అన్నారు. రైతులంతా ఈ సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నారని తెలిపారు.
రైతులపై లాఠీచార్జికి ఖండన
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కాన్వారును అడ్డుకున్న రైతులపై లాఠీఛార్జి చేయడాన్ని ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్‌ధావలే, ప్రధాన కార్యదర్శి హన్నన్‌మొల్లా తీవ్రంగా ఖండించారు. బాధ్యులైన పోలీసులను డిస్మిస్ చేయాలనీ, ఘటనకు కలెక్టర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.