Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీకాలు వేయకపోతే 8 నెలల తర్వాత థర్డ్‌వేవ్ : పరిశోధకులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోన ఉధృతి కొనసాగుతూనే ఉంది. తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కోవిడ్-19 సెకండ్ వేవ్ వచ్చే జులై నాటికి అంతమైపోవచ్చునని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అలాగే, త్వరలోనే థర్డ్‌వేవ్ కూడా విరుచుకుపడే అవకాశమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ పరిధిలోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశంలో కరోనా ప్రభావాన్ని ''సూత్ర'' (ససెప్టబుల్, అన్‌డిటెక్టెడ్, టెస్టెడ్ (పాజిటివ్) అండ్ రిమూవ్డ్ అప్రోచ్) అనే మోడల్ ద్వారా అంచనా వేసింది. ఆ వివరాల ప్రకారం.. వచ్చే జూలై నాటికి కరోనా సెకండ్‌వేవ్ అంతమైపోతుందనీ, ఆ తర్వాత 6 నుంచి 8 నెలల్లోపు కరోనా థర్డ్‌వేవ్ వచ్చే అవకాశముంది. అయితే, అది సెకండ్‌వేవ్ అంత ప్రభావం ఉండదని శాస్త్రవేత్తల బృందం అంచనా వేసింది. కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తృతంగా చేపట్టకపోతే థర్డ్‌వేవ్ ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని సూత్ర మోడల్లో పాలుపంచుకున్న సైంటిస్ట్ ఎం.విద్యాసాగర్ అన్నారు. కాగా, దేశంలో మే నెలాఖరుకు రోజువారీ కరోనా కేసులు 1.5 లక్షలకు తగ్గుతాయని పరిశోధకులు అంచనావేశారు. జూన్ ఆఖరు నాటికి 20వేలకు తగ్గుతుందన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటక సహా పలు రాష్ట్రాల్లో కరోనా పీక్ దశకు చేరిందన్నారు. ఇక తమిళనాడు, పంజాబ్ హిమాచల్‌ప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో మే 19 నుంచి 31 మధ్య కరోనా కేసుల తీవ్రత పీక్ దశకు చేరుతాయని అంచనా వేశారు. ఏదేమైనప్పటీకీ దేశంలో అక్టోబర్ వరకు కరోనా థర్డ్‌వేవ్ ఉండకపోవచ్చునని సూత్ర మోడల్ అంచనా వేసింది. వ్యాక్సినేషన్ పెంచడం ద్వారా వైరస్ ప్రభావితం తక్కువగా ఉంటుందని తెలిపింది. కాగా, కరోనా ప్రభావంపై అంచనా వేసేందుకు గణితశాస్త్ర విధానాల్లో సూత్ర ఒకటి. దీని అధారంగానే 'జాతీయ కోవిడ్-19 సూపర్‌మోడల్ కమిటీ' దేశంలో కరోనా వ్యాప్తి అంచనాలను రూపొందిస్తోంది.