Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కట్టడిలో వైఫల్య నేతలు వీళ్లే
- మోడీ, ట్రంప్, బోల్సనారో, లోపెజ్, లుకసెంకో ఘోరంగా విఫలం
- పర్యవసానంగా దారుణ పరిస్థితులు
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావంతో ఏర్పడిన సంక్షోభం దాదాపు అన్ని ప్రపంచ దేశాలనూ అతలాకుతలం చేసింది. కరోనా బారినపడి లక్షలాది మరణాలు సంభవించడంతోపాటు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. అనేకమంది ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారాలు చేసుకునే వారు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆయా దేశాల్లో విధించిన లాక్డౌన్ సమయంలో తినేందుకు తిండి లేక ఆకలి చావులకు గురైన దయనీయ పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సోషలిస్టు దేశాలు ఈ వైరస్ ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని తగిన చర్యలు తీసుకోవడం ద్వారా తిరిగి పురోగతి దిశగా పయనిస్తుండగా.. భారత్, అమెరికా, బ్రెజిల్, మెక్సికో, బెలారస్ తదితర దేశాల్లో ప్రభుత్వా ధినేతల నిర్లక్ష్యం, కరోనా కట్టడంలో వైఫల్యం తీవ్ర పరిణామాలకు దారితీసింది. భారత్‌లో కరోనా రెండో దశపై వైద్య నిపుణులు చేసిన హెచ్చరికలను మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం ఎటువంటి భయానక పరిస్థితులు నెలకొన్నాయో ఇప్పడు మనం చూస్తున్నాం. కరోనా కట్టడిలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాల పాత్ర అనేది కీలకం. కొన్ని దేశాల్లో ప్రస్తుత నేతలు కావొచ్చు, గత పాలకులు కావచ్చు.. ఎవరైనా కరోనాపై సమర్ధవంతమైన పోరు చేయలేకపోయారు. వైరస్ ప్రభావాన్ని తక్కువగా చూపించడం, సైన్స్‌తో పాటు భౌతిక దూరం, మాస్కు ధరించడం వంటి జాగ్రత్తలను విస్మరించడం వంటి నిర్లక్ష్యపు చర్యలకు పాల్పడ్డారు. దీని ఫలితంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పడు విపరీత పరిణామాలను ఆయా దేశాల ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
మోడీ - భారత ప్రధాని
తొలి దశలో అతలాకుతలమైన భారత్‌లో కరోనా రెండో దశ మరింత విజృంభిస్తోంది. రోజుకు లక్షల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. అత్యవసర సమయంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదు పాయం, రెమ్‌డిసీవర్ వంటి ఔషధాలు అందు బాటు లో లేని కారణంగా అనేకమంది మరణిస్తున్నారు. బెడ్లు దొరకక రోగులు, వారి బంధువులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో చికిత్స అందక పలువురు మరణిస్తున్నారు. దేశంలో నెల కొన్న ప్రస్తుత పరిస్థితులకు ప్రధాని మోడీ నిర్లక్ష్యపు వైఖరే కారణమని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. భారత్‌లో కరోనాను కట్టడి చేయడం ద్వారా దేశ మానవాళిని రక్షించుకున్నాం.. అని మోడీ ఈ ఏడాది జనవరి నెలలో ఒక గ్లోబల్ ఫోరంలో ప్రకటిం చేశారు. కరోనా వైరస్ ప్రభావం ముగింపు దశకు చేరుకుందని ఆరోగ్యశాఖ మంత్రి మార్చిలో పేర్కొ న్నారు. వాస్తవంగా కరోనా భారత్‌తో పాటు పలు దేశాల్లో తన ప్రభావాన్ని మరింత ఉధృతం చేసింది. రెండో దశ వైరస్ వ్యాప్తి గురించి వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా.. మోడీ ప్రభుత్వం పెడచె విన పెట్టింది. దేశంలో వైరస్ ప్రభావం ఇంకా పూర్తి గా తగ్గకుండానే.. ఇటీవల జరిగిన అసెంబ్లీల ఎన్నికల సమయంలో మోడీ, అమిత్‌షాలతోపాటు పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నేతలు ఆయా రాష్ట్రాల్లో లక్షలాది మందితో భారీయెత్తున ర్యాలీలు, సభలు నిర్వహించారు. కుంభమేళా వంటి లక్షలాది మంది పాల్గొనే కార్యక్రమానికి అనుమతులు ఇచ్చేశారు. ఇతర దేశాలకు కోటికి పైగా వ్యాక్సిన డోసుల ను సాయం చేశామని మోడీ సర్కారు గొప్పగా చెప్పు కుంటోంది. దేశంలో 130 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాలో రెండు శాతమే రెండు డోసులనూ వేయించుకోగలిగారు.
చైనాపై నెపం పెట్టి... తప్పుడు వాదనలు
డోనాల్డ్ ట్రంప్ : అమెరికా మాజీ అధ్యక్షుడు
డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పదవిలో లేకపోయినా.. గతేడాది కరోనా కట్టడిలో ఆయన వైఫల్యం అమెరికాపై వినాశకరమైన దీర్ఘ కాలిక ప్రభావాలను కలిగిస్తోంది. కరోనా ప్రభావం మొదలైన తొలినాళ్లలో వైరస్ ప్రభావాన్ని ట్రంప్ తక్కువ అంచనా వేశారు. మాస్కులు ధరించడం, చికిత్సకు సంబంధించిన ఆయన చేసిన తప్పుడు, అసంబద్ధ వాదనలు ఆ దేశంపై, కొన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అమెరికా జనాభాలో ఆఫ్రికన్ అమెరికన్స్, లాటిన్ అమెరికన్స్ 31 శాతం మంది మాత్రమే ఉన్నా.. దేశంలో కరోనా భారినపడిన వారిలో వీరి సంఖ్య 55 శాతానికి పైగా ఉంది. శ్వేతజాతీయులతో పోల్చుకుంటే.. ఆస్పత్రి పాలైన లేదా మరణించిన వారి సంఖ్య వీరిలోనే అధికంగా ఉంది. అమెరికాలో తీవ్రస్థాయిలో నిరుద్యోగం పెచ్చరిల్లింది. పేదరికం, గృహ అస్థిరత, విద్యలో నాణ్యత లోపించడం వంటి అసమానతలు మరింత విస్తరించాయి. మరోవైపు కరోనాకు చైనానే కారణంటూ అసంబద్ధ ఆరోపణలు చేశారు.
చిన్న ఫ్లూ అంటూ ముంచేశాడు
జైర్ బోల్సొనారో: బ్రెజిల్ అధ్యక్షుడు
కరోనా కట్టడిలో ఘోరంగా విఫలమైన బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో వైరస్‌ను చిన్న ఫ్లూగా చెప్పుకొచ్చారు. దేశంలో కరోనా తీవ్రస్థాయిలో రెచ్చిపోవడానికి ఆయన నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణంగా ఉంది. క్లినికల్స్ ప్రొటోకాల్స్, డేటా వెల్లడి, వ్యాక్సిన్ కొనుగోలు వంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ పాలనాపర వ్యవహారాల్లో బోల్సొనారో తన రాజ్యాంగ అధికారాలను వినియోగించుకొని జోక్యం చేసుకున్నారు. మతపరమైన ప్రాంతాల్లో మాస్కుల వినియోగం తప్పనిసరి, కరోనా బాధితులుగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు పరిహారం అందించే చట్టాన్ని వీటో చేశారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు మోకాలడ్డుతూ.. అత్యవసరం అంటూ స్పాలు, జిమ్‌లు వంటి అనేక వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఇచ్చేశారు. కరోనా చికిత్సకు వైద్యపరంగా నిరూపితం కాని హైడ్రాక్సిక్లోరోక్విన్ వంటి మెడిసిన్ ప్రోత్సహించారు. కరోనా సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని నిందలు వేసి.. అధ్యక్షుడిగా తన బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేశారు. దుష్ఫరిణామాలు ఉంటాయంటూ.. తాను వ్యాక్సిన్ తీసుకోనని గతేడాది డిసెంబర్లో ఒక అధ్యక్షుడిగా ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడిలో బోల్సొనారో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఏడాది సమయంలో ఆరోగ్య మంత్రిగా నలుగురిని మార్చాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
నిర్లక్ష్యంతో 9.2 శాతం మరణాలు
అండ్రూస్ మాన్యేల్ లోపేజ్ : మెక్సికో అధ్యక్షుడు
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే మెక్సికోలో కరోనా మరణాల రేటు అధికంగా ఉంది. ఇక్కడ కరోనా బారిన పడిన వారిలో 9.2 శాతం మంది మరణించారు. భారత్, అమెరికా వంటి అధిక జనాభా కలిగిన దేశాలతో పోల్చుకుంటే ఆరు లక్షలకు పైగా మరణాలు సంభవించి ఉంటాయని ఇటీవలి అంచనాల్లో తేలింది. మహమ్మారి సమయమంతా.. అధ్యక్షుడు అండ్రూస్ మాన్యేల్ లోపేజ్ దేశంలో పరిస్థితులను తొక్కిపట్టే ప్రయత్నం చేశారు. వైరస్ ప్రభావం మొదట్లోనే కొన్ని రోజుల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ విధించాలన్న సూచనలను ఆయన పట్టించుకోలేదు. రెండు నెలల పాటు ఆంక్షలు విధించిన మార్చి 23 ముందు వరకూ అనేక ర్యాలీలు నిర్వహించారు. మాస్కు ధరించేందుకు కూడా ఆయన తిరస్కరించారు. 2018లో అధికారంలో వచ్చిన నాటి నుంచి కరోనా ముందు వరకు ఆయన దేశంలోని ఆరోగ్య రంగాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కరోనా నేపథ్యంలో కేటాయింపులు కూడా తగినంతగా లేవు.
మాస్కు వేసుకోకుండా తప్పుడు సంకేతాలు
అలెగ్జాండర్ లుకసెంకో : బెలారస్ అధ్యక్షుడు
బెలారస్‌కు దీర్ఘకాలంగా అధ్యక్షుడుగా ఉన్న అలెగ్జాండర్ లుకసెంకో కరోనా ముప్పును తక్కువ అంచనా వేశారు. కరోనా వ్యాప్తి తొలిరోజుల్లో అనేక దేశాలు లాక్డౌన్లు విధిస్తున్న సమయంలో బెలారస్లో వైరస్ కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వోడ్కా, ఆవిరి తీసుకోవడం, పొలాల్లో పనిచేస్తే వైరస్ రాదని వ్యాఖ్యానించారు. ఈ విధమైన నిర్లక్ష్య వైఖరి దేశంలో కరోనా విపత్కర పరిణామాలకు దారితీసింది. గతేడాది వేసవిలో లుకసెంకో కరోనా భారిన పడ్డారు. తనకు లక్షణాలు లేవని, వైరస్ తీవ్రమైన ముప్పేమీ కాదని మళ్లీ చెప్పుకొచ్చారు. మాస్కు ధరించకుండా ఆస్పత్రులను సందర్శిస్తూ తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. బెలారస్లో ఇటీవలే వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తాను మాత్రం వ్యాక్సిన్ వేయించుకోనని లుకసెంకో అన్నారు.
-