Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణం
- నిరాడంబరంగా లెఫ్ట్ మంత్రివర్గం బాధ్యతల స్వీకరణ
- ఏచూరిసహా పలువురు నేతల హాజరు
- ప్రధాని మోడీ, స్టాలిన్, పవార్ శుభాకాంక్షలు
తిరువనంతపురం: కేరళలో కొత్త అధ్యయాన్ని లిఖిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో గురువారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. కోవిడ్ నిబంధనల మధ్య నిరాడంబరంగా ఈ కార్యక్రమం సాగింది. మంత్రులుగా మరో 20 మంది ప్రమాణం చేశారు. సీఎంగా ప్రమాణం అనంతరం విజయన్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా నవ కేరళను నిర్మించేందుకు కలసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. విజయన్‌కు ప్రధాని మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో పాటు పలు పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి, తన రెండో టర్మ్‌ను ప్రారంభించిన విజయన్‌కు శుభాకాంక్షలు అని మోడీ తన ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నారు. నా సోదరుడికి బెస్ట్ విషెస్ అంటూ శుభాకాంక్షలు చెప్పిన తమిళనాడు సీఎం స్టాలిన్.. విజయన్‌కు ఉన్న సంకల్పం, పట్టుదల కేరళ ప్రజల సామాజిక సమానత్వం, శాంతి, శ్రేయస్సుకు బాటలు వేస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. కేరళ ప్రజల అభివృద్ధి వైపుగా పయనం సాగిస్తున్న విజయన్‌కు శుభాకాంక్షలు అని శరద్‌పవార్ ట్వీట్ చేశారు. సీపీఐ(ఎం) నుంచి 11 మంది, సీపీఐ నుంచి నలుగురు, ఎల్డీఎఫ్ కూటమిలో ఉన్న ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త క్యాబినెట్‌లోని 21 మందిలో విజయన్, మరో ముగ్గురు మినహా మిగిలిన 17 మంది మంత్రి పదవికి కొత్తవారే కావడం గమనార్హం.
ఏచూరితో పాటు పలువురు నేతల హాజరు
కరోనా నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పలు పార్టీల నేతలు, మంత్రుల కుటుంబ సభ్యులతో సహా దాదాపు 400 మంది హాజరయ్యారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు కొడియేరి బాలక్రిష్టన్, ఇన్చార్జిగా ఉన్న సీపీఐ(ఎం )రాష్ట్ర కార్యదర్శి విజయరాఘవన్, తదితర నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని పేర్కొంటూ యూడీఎఫ్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. రాజ్‌భవన్ కాకుండా.. వేరే ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేసిన మూడో ఎల్డీఎఫ్ క్యాబినెట్ ఇది కావడం గమనార్హం. 2006లో విఎస్.అచ్యుతానందన్ నేతృత్వంలో, 2016లో విజయన్ నేతృత్వంలో కేబినెట్ రాజ్భవనేతర ప్రాంతంలో ప్రమాణస్వీకారం చేసింది.
వీఐపీలుగా బీడీ కార్మికుడు జనార్థన్, మేకల కాపరి సుబైదా
పలువురు ప్రత్యేక ఆహ్వానితులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. కరోనా పోరుకు రూ.2 లక్షల విరాళం అందించిన కన్నూరుకు చెందిన బీడీ కార్మికుడు జనార్ధన్, తన రెండు మేకలను అమ్మి డబ్బు అందించిన కొల్లాంకు చెందిన సుబైదాలకు వీఐపీ హోదాలో అవకాశం కల్పించారు.