Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి పట్టణంలో ఒక మసీదును జిల్లా అధికారులు కూల్చివేసిన కొన్ని రోజుల తరువాత, స్థానిక పోలీసులు గురువారం ఎనిమిదిమందిపై కేసు నమోదు చేశారు. ఈ నిర్మాణాన్ని ఉత్తరప్రదేశ్ సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఆస్తిగా రిజిస్టర్ చేయించేందుకు మోసం చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. రామ్‌సనేహి ఘట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సచ్చితానంద్ రారు మాట్లాడుతూ నిందితులు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని, 2019లో మసీదు భవనాన్ని వక్ఫ్ బోర్డు ఆస్తిగా రిజిస్టర్ చేయించారని చెప్పారు. నిందితుల్లో అప్పటి యుపి సున్నీ వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ మహ్మద్ తహా కూడా ఉన్నారని తెలిపారు. మిగిలిన నిందితుల్లో కమిటీ చైర్మన్ ముస్తాక్ అలీ, ఉపాధ్యక్షుడు వకిల్ అహ్మద్, కార్యదర్శి మహ్మద్ అనీస్, సభ్యులు మహ్మద్ ముస్తాకిమ్, దస్తగిరి, అఫ్జల్ ఉన్నారు. జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సోనుకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ను దాఖలు చేశారు. అక్రమ నిర్మాణమని పేర్కొంటూ జిల్లా అధికారులు ఈనెల 17న మసీదును కూల్చివేశారు. ఇది చట్టానికి వ్యతిరేకమని, అధికార దుర్వినియోగం అని పేర్కొంటూ యుపి సున్ని సెంట్రల్ వక్ప్‌బోర్డు ప్రకటన విడుదల చేసింది. మే 31 వరకు మసీదును కూల్చొద్దని ఏప్రిల్ 24న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీచేసినా, అధికారులు ఉల్లంఘించి కూల్చివేశారని ఛైర్పర్సన్ జుఫార్ ఫరూకి అన్నారు.