Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండమాన్ దీవులకు చేరిన రుతుపవనాలు
- బెంగాల్, ఒడిషాలపై తుపాను ప్రభావం
- సిబ్బందిని తరలింపులో ఎన్డిఆర్ఎఫ్
న్యూఢిల్లీ: ఇటీవల దేశ పశ్చిమ తీర రాష్ట్రాలపై తౌక్టే తుపాను విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తూర్పు రాష్ట్రాలకు ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిషాలకు యాస్ తుపాను ముప్పు పొంచి వుంది. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల మీదుగా సాగుతున్నాయని భారత వాతావరణ శాఖ విభాగం(ఐఎండి) శుక్రవారం పేర్కొంది. ఈ పవనాలు దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ దక్షిణ సముద్ర ప్రాంతం, పలు అండమాన్ ఉత్తర ప్రాంతాల్లోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం తుపానుగా మారే అవకాశం ఉందని, యాస్ అని పిలువబడే ఈ తుపాను ఈనెల 26వ తేదీ సాయంత్రానికి పశ్చిమబెంగాల్-ఒడిషాల మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసిన విషయం తెలిసిందే. తూర్పు తీరంలోని మూడు రాష్ట్రాలపై తుపాను ప్రభావం ఉంటుందన్న నేపథ్యంలో బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో ఎన్డిఆర్ఎఫ్ అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాల్లో సిబ్బంది మోహరింపును ప్రారంభించింది. తౌక్టే తుపాను నేపథ్యంలో ప్రభావిత పశ్చిమ తీర రాష్ట్రాలకు పంపిన సిబ్బందిలో కొంత మందిని బెంగాల్, ఒడిషాలకు పంపేందుకు వారిక అక్కడి నుంచి వెనక్కు పిలిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సిబ్బందిని విమానాలు, హెలికాప్టర్ల ద్వారా బెంగాల్, ఒడిషాలకు తరలించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఎన్డిఆర్ఎఫ్ డైరెక్టర్ ఎస్.ఎన్ ప్రధాన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోని పలు తీర ప్రాంత జిల్లాలపై యాస్ తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. తౌక్టే నేపథ్యంలో కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, గోవాలోని తీర ప్రాంతాల్లో 101 ఎన్డిఆర్ఎఫ్ బందాలను మోహరించారు. అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఇప్పుడు బెంగాల్, ఒడిషాలకు బందాల తరలింపు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
శనివారం నాడున ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండి గురువారం పేర్కొంది. ఇది తదుపరి 72 గంటల్లో తుపానుగా మారి, అనంతరం వాయువ్య దిశగా పయనించి 26వ తేదీ సాయంత్రం బెంగాల్-ఒడిషాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖకు చెందిన తుపాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ తుపానుగా యాస్ అనే పేరును ఒమన్ పెట్టింది. ఇటీవలి తౌక్టే తుపాను పేరును మయన్మార్ సూచించింది.