Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా : బెంగాల్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆస్పత్రులలో బెడ్లు లేవు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. కేసుల సంఖ్య శరవేగంగా పెరిగి పరిస్థితి అదుపుతప్పుతోంది. రోగులను ఆస్పత్రులకు తరలించడం ఒక పెద్ద సవాలు గా మారింది. ఆంబ్యులెన్సులు అందుబాటులో లేవు. ఆస్పత్రుల వెలుపల రోగులు శ్వాస తీసుకోలేని స్థితిలో మరణావస్థ పడుతున్న దృశ్యాలు నిత్యం కానవస్తున్నాయి. మరణాల సంఖ్య పెరిగిపోయింది. స్మశానవాటికలన్నీ మృతదేహాలతో నిండిపోయాయి. కనీసం చావులోనైనా మర్యాద లేకుండా మృతకళేబరాలను కుప్పగా చేసి తగులబెడుతున్న సందర్భాలూ ఉన్నాయి.
ఈ సమయంలో మూడవసారి గెలిచి - అది కూడా రెండువందలకు పైగా సీట్లలో- అధికారం చేపట్టిన మమతాబెనర్జీ నారదా స్కాంలో ఇరుక్కున్న తన అనుయాయుల విడుదల కోసం 3000 మందితో సిబిఐ కార్యాలయం ముందు ధర్నా చేసింది. ప్రజలను కరోనానుండి కాపాడడం ఆమె మొదటి ప్రాధాన్యతగా లేదని ఈ సంఘటన ఋజువు చేస్తోంది. ఇక కేంద్ర బిజెపి ప్రభుత్వం బెంగాల్ కు చేసిన సహాయం ఏమీ లేకపోగా తన పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకుంది. రాష్ట్ర గవర్నరు ఎన్నికల అనంతర హింసను ఉన్నదానికన్నా పెద్దగా చిత్రీకరించడానికి నానా తంటాలూ పడుతూ, రాజ్యాంగ పరిమితులను సైతం అతిక్రమిస్తున్నాడు.
ఈ ఎన్నికలలో ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయినప్పటికీ, సిపిఎం కార్యకర్తలు మాత్రం ప్రజల పట్ల తమ నిబద్ధతలో ఏమాత్రమూ సడలింపు లేదని ఋజువు చేస్తున్నారు. సిపిఎం కార్యకర్తలు. సానుభూతిపరులు దాదాపు ఒక లక్షమంది రెడ్ వలంటీర్లుగా బృందాలుగా ఏర్పడి ఈ కష్టకాలంలో ప్రజలను ఆదుకోడానికి రంగంలోకి దిగారు.
ఆక్సిజన్ సిలిండర్లను బుజాలపై మోసుకుని అవసరమైన పేషెంట్ల ఇళ్ళకు చేర్చడం, అత్యవసరంగా ఆస్పత్రులకు తీసుకుపోవలసిన వారికి ఆంబ్యులెన్సులను ఏర్పాటు చేయడం, హోం-ఐసొలేషన్ లో ఉన్న కుటుంబాలకు ఇళ్ళవద్దకే మందులు అందించడం, నిత్యావసరాలను అందించడం, అవసరమైనవారికి ఇళ్ళ వద్దే వండించిన ఆహారాన్ని తీసుకుపోయి అందించడం, - ఇలా వివిధ రకాల సేవలలో మనకు ఇప్పుడు బెంగాల్ లో రెడ్ వలంటీర్లు దర్శనమిస్తున్నారు.
ఈ రెడ్ వలంటీర్లు నివాసప్రాంతాలవారీగా వాట్పప్ గ్రూపులుగా ఏర్పడి బృందాలుగా పని చేస్తున్నారు. తమ వాట్సప్ నంబర్లను నివాసప్రాంతంలోని ప్రజలకు తెలియజేసి, వారివద్దనుండి సహాయం కోసం ఎటువంటి విజ్ఞప్తులు వచ్చినా వెంటనే తమ గ్రూపులో సంప్రదించుకుని ఆ సహాయాన్ని అందించేందుకు పూనుకుంటున్నారు. ఆక్సిజన్ , ఆస్పత్రులలో బెడ్లు, ప్రాణరక్షక ఔషధాలు, ఆంబ్యులెన్సులు వంటివి ఎక్కడెక్కడ లభిస్తున్నాయో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని సేకరించి ఈ వాట్సప్ గ్రూపులకు తెలియజేసే పనిలో దాదాపు 3000 మంది వలంటీర్లు నిమగమైవున్నారు.
ఒకసారి తమ సహాయం కోరివచ్చిన రోగులతో నిత్యం సంప్రదిస్తూ, వారు పూర్తిగా కోలుకునేవరకూ అవసరమైన తోడ్పాటును అందిస్తున్నారు.
ఈ విధంగా సేవలనందించడానికి కృషి చేసే క్రమంలో తాము కూడా కరోనా బారిన పడే ప్రమాదం ఉందని రెడ్ వలంటీర్లకు తెలుసు. ఐనా లెక్క చేయకుండా ప్రజలకోసం పాటుపడేందుకు ముందుకు వస్తున్నారు. కరోనా ప్రమాదంతోబాటు ఎన్నికల అనంతరం తృణమూల్ గూండాల దాడులను కూడా వీరిలో కొందరు భరించాల్సివచ్చింది. ఐనా వెనకడుగు వేయలేదు.
రెడ్ వలంటీర్ల కృషి రోజులు గడుస్తున్నకొద్దీ విస్తృతమౌతోంది. అదే విధంగా, వారి సేవలను శ్లాఘించే సాధారణ పౌరుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆర్ధికంగా తోడ్పాటును ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నవారూ పెరుగుతున్నారు. అధికారమే పరమావధిగా వ్యవహరించే ఇతర పాలకవర్గ పార్టీలకు, ప్రజా ప్రయోజనాలే అధికారం కన్నా ముఖ్యం అని భావించే కమ్యూనిస్టులకు తేడా బెంగాల్ లో ఇప్పుడు ప్రజలకు కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది.