Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి..
- మోడీ సర్కార్ను కోరిన అమెరికా, కెనడాలోని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, కార్మికసంఘాలు
న్యూఢిల్లీ : నూతన సాగు చట్టాల్ని వెంటనే రద్దు చేయాలని అమెరికా, కెనడాకు చెందిన 200మందికిపైగా విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, కార్మిక సంఘాల నాయకులు మోడీ సర్కార్ను డిమాండ్ చేశారు. భారత్లో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వారంతా ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారిని అడ్డుకునే కార్యక్రమాన్ని పక్కకుపెట్టి, మోడీ సర్కార్ రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేయటాన్ని వారు తప్పుబట్టారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ చేయాలని వారు సూచించారు. భారత్లో జరుగుతున్న రైతు ఆందోళనకు మద్దతు తెలుపుతూ కెనడాలోని పలు కార్మిక సంఘాలు తీర్మానం చేశాయి. కెనడియన్ లేబర్ కాంగ్రెస్, కెనడియన్ యూనియన్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయీస్, ఫెడరేషన్స్ ఆఫ్ లేబర్, యునిఫోర్...భారత్లో రైతుల నిరసనకు మద్దతు తెలిపాయి. వీరు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.
వారి ఆందోళన సరైందే..కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై రైతులు ఆందోళన వ్యక్తం చేయటం సరైందే. వారి భూమి, ఆహార ఉత్పత్తులు..అన్నీ
కార్పొరేట్ చేతుల్లోకి పోయే ప్రమాదముంది. ఈ చట్టాలు వ్యవసాయరంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టుతాయి. ఢిల్లీ సరిహద్దులో నవంబరు, 2020 నుంచి రైతులు ఏకధాటిగా నిరసనలు చేపడుతున్నా..వారి ఆందోళనను కేంద్రం పెడచెవిన పెడుతోంది. టియర్ గ్యాస్, జలఫిరంగులతో పోలీసులు ఓ వైపు దాడులు చేస్తున్నారు. మరోవైపు అత్యంత చలి, భీకరమైన వర్షాలు, ఇప్పుడు ఎండ తీవ్రత...రైతుల్ని తీవ్రంగా ఇబ్బందిపెట్టాయి. పోలీసుదాడులు, ఆరోగ్య సమస్యలతో ఎంతోమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఉద్యమం ఆగలేదు. ఇప్పటికైనా రైతుల డిమాండ్లను కేంద్రం నెరవేర్చాలి. కాగా రైతు సంఘాలు మరోసారి కేంద్రం చర్చలకు పిలవాలని కోరుతున్నాయి.