Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెలలో 13వ సారి పెరిగిన ధరలు
- పెట్రోల్‌పై 19 పైసలు, డీజీల్‌పై 29 పైసలు
- కరోనాకాలంలోనూ కరుణచూపని కేంద్రం
న్యూఢిల్లీ : కరోనా కష్టకాలంలో పెట్రో ధరలు సామాన్యుడి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఈ కష్టకాలంలో ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకోని మోడీ సర్కారు.. ఇంధన ధరలను ఎడాపెడా పెంచెస్తున్నది. తాజాగా మళ్లీ పెట్రోల్‌పై 19 పైసలు, డీజీల్‌పై 29 పైసలు పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ఈ ఒక్క నెలలోనే పెట్రోల్, డీజీల్ ధరలు 13 సార్లు పెరిగాయి. అలాగే, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ మార్కును దాటి పరుగెడుతున్నాయి. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ. 93.04గా ఉన్నది. డీజీల్ ధర రూ. 83.80గా రికార్డయ్యింది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ సెంచరీకి చేరువైంది. పెట్రోల్ ధర రూ. 99.32గా నమోదుకాగా, డీజీల్ ధర రూ. 91.01కి ఎగబాకింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 94.71గా, డీజీల్ ధర రూ. 88.62గా ఉన్నాయి. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.11 కాగా, డీజీల్ ధర రూ. 86.64కు ఎగబాకింది. ఇక రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ మార్కును దాటడం విశేషం. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో లీటర్ పెట్రోల్ రూ. 104.01గా, హనుమాన్గర్లో రూ. 103.36గా, బికనీర్‌లో రూ. 102.12గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 20 పైసల పెరుగుదలతో ధర రూ. 96.70కు చేరుకున్నది. డీజీల్‌పై 32 పైసలు పెరిగి ధర రూ. 91.36కు ఎగబాకింది. దేశంలో అడ్డూ, అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రో ధరలతో నిత్యవసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయనీ దేశంలో సామాన్యప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.