Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలగావ్ కస్టోడియల్ డెత్‌పై మహారాష్ట్ర జైళ్ల శాఖ స్పందన కరువు
ముంబయి : మహారాష్ట్రలోని జలగావ్ సబ్జైల్లో ఎనిమిది నెలల క్రితం జరిగిన కస్టోడియల్ డెత్ విచారణ ముందుకు జరగడంలేదు. బాధ్యులైన జైలు సిబ్బందిపై చర్యలూ ప్రారంభం కాలేదు. దీనిపై రాష్ట్ర జైళ్ల శాఖ ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. అలాగే పలు అనుమానాలను రేకెత్తిస్తున్నది. జలగావ్ సబ్‌జైలులో రవీంద్ర జగ్తప్ ఓ కేసులో విచారణను ఎదుర్కొంటు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, దాదాపు ఎనిమిది నెలల క్రితం సదరు వ్యక్తి జైలలో అతి దారుణమైన స్థితిలో చనిపోయాడు. జైలు సూపరింటెం డెంట్‌తో పాటు ఐదుగురు అధికారులు ఆయనను దారుణంగా కొట్టినట్టు కూడా ఆరోపణలు వినబడ్డాయి. కాగా, ఆయనపై దాడి, గాయాలకు సంబంధించిన విషయాలు పోస్టుమార్టం నివేదికలో బయటపడ్డాయి. ముగ్గురు వైద్యులతో కూడిన బృందం ఈ నివేదికలో ఆయన మృతికి గల కారణాలను పేర్కొన్నది. అంతేకాదు, ఒక జైలు అధికారితో పాటు తోటి ఖైదీలు డజను మందికి పైగా సాక్షులు జగ్తప్పై పోలీసు అధికారుల క్రూరత్వాన్ని గురించి ఆరోపణలు చేశారు. ఫలితంగానే రవీంద్ర జగతప్ మృతి చెందాడని వెల్లడించారు. ఇటు శవపరీక్ష నివేదిక, అటు సాక్షుల ఆధారాలున్నప్పటికీ జైలు సిబ్బందిపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.