Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయినా ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వని తీరు
- భారత్‌లో పరిస్థితి విచిత్రం
- మోడీ సర్కారు తీరే కారణం : నిపుణులు
న్యూఢిల్లీ : దేశాన్ని కరోనా సెకండ్‌వేవ్ పట్టిపీడిస్తున్నది. కరోనా తొలి దశను అంతం చేశామని ప్రకటించుకున్న మోడీ ప్రభుత్వం రాబోయే ఉపద్రవాన్ని పసిగట్టడంతో విఫలమైంది. ఈ ఏడాది జనవరి నుంచే దేశ ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్‌ను ఇవ్వడం ప్రారంభించింది. అంతేకాకుండా, ఇతర దేశాలకు వ్యాక్సిన్ డోసులను సరఫరా చేస్తూ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ప్రచారం చేసుకున్నది మోడీ సర్కారు. అయితే, సెకండ్‌వేవ్ దేశంలో ప్రవేశిస్తేగానీ మోడీ సర్కారుకు వాస్తవ పరిస్థితులు అర్థం కాలేదని ఆరోగ్యనిపుణులు తెలిపారు. విదేశాలకు ఎగుమతి విషయం పక్కనబెడితే దేశ ప్రజలకే ఇప్పుడు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ను ఇవ్వడం కష్టతరంగా మారిందని గుర్తు చేశారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 18 కోట్ల మంది తొలి డోసును పొందారు. ఇక దాదాపు 3 శాతం మంది వరకు మాత్రమే రెండు డోసులను పొందారు. సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్‌లు అభివృద్ధి చేసిన కోవాక్జిన్, కోవిషీల్డ్‌లను వ్యాక్సిన్లను ఉపయోగించారు. సెకండ్‌వేవ్‌ను ఊహించని మోడీ సర్కారు 'ఆత్మనిర్భర్ భారత్'కు పరిమితమై దేశీయ వ్యాక్సిన్లకు మాత్రమే పరిమితమై దేశ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిందని నిపుణులు ఆరోపించారు. అంతటితో ఆగని కేంద్రం గొప్పలకు పోయి విదేశాలకు వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసిందని గుర్తు చేశారు.
అయితే, అంతర్జాతీయ సంబంధాలు, ఒప్పందాల్లో భాగంగా ఈ వ్యాక్సిన్ల ఎగుమతి జరిగిందని ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నాయకులు చెప్తున్నప్పటికీ.. కరోనా సెకండ్‌వేవ్ లాంటి పెద్ద ఉపద్రవాన్ని ముందుగా పసిగట్టకపోవడం మోడీ ప్రభుత్వం వైఫల్యంగానే గుర్తించాల్సిన అవసరమున్నదని నిపుణులు వాదించారు.
దేశంలో టీకాల ఉత్పత్తిని పెంచకపోవడం, ఇతర ఫార్మా కంపెనీలకు అనుమతులివ్వకపోవడం, విదేశీ వ్యాక్సిన్ల దిగుమతి విషయంలో అనుమతులకు ఆలస్యం చేయడం వంటివి మోడీ సర్కారు ఉదాసీన వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత వైఖరి కారణంగానే దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా నడవడంలేదని చెప్పారు. ఈ ఏడాది చివరి వరకు కూడా భారత్‌లో దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తి కాదనీ, 35 శాతం మంది ప్రజలకే టీకాలు ఇవ్వడం అతికష్టం మీద పూర్తవుతుందన్న పలు అంతర్జాతీయ సంస్థల నివేదికలను ఆరోగ్య నిపుణులు ఉటంకిస్తున్నారు.