Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జోసెఫ్ విమర్శ
కోచి : వ్యక్తులకు, సామాజిక కూర్పులకు సంబంధించిన కీలకమైన చరిత్రలను పలు భారతీయ విశ్వవిద్యాలయాల సిలబస్‌ల నుండి మినహాయించేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు ఒక ముగింపుగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ముసాయిదా చరిత్ర సిలబస్ వెలువడిందని కేరళ హిస్టరీ కాంగ్రెస్ పేర్కొంది. ఈ సిలబస్‌నే అమలు చేస్తే చరిత్ర రచన తిరిగి వలసవాద కాలానికి వెళ్లిపోతుందని కేరళ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సెబాస్టియన్ జోసెఫ్ వ్యాఖ్యానించారు. లౌకిక మూలాలపై, వృత్తిపరమైన చారిత్రక రచన మూలాలపై దాడి చేయడమే అవుతుందని పేర్కొన్నారు. సమస్యపైనే దృష్టి కేంద్రీకరించే విధానంతో భారతదేశ చరిత్రను పరిశీలించడానికి బదులుగా యుజిసి కొత్త ముసాయిదా మళ్లీ జేమ్స్ మిల్ వైఖరినే అనుసరించిందన్నారు. హిందూ, ముస్లిం, బ్రిటీష్ కాలం అంటూ చరిత్రను విభజించే ప్రయత్నం చేసిందని జోసెఫ్ పేర్కొన్నారు. పూర్తి చారిత్రక దృక్పథం, భారత చరిత్రలోని సూక్ష్మ, విస్తృత అంశాలపై దృష్టి కేంద్రీకరించడం వంటి నిర్దిష్ట లక్ష్యాల గురించి ముందు పీఠికలో పేర్కొన్నప్పటికీ, ఆ లక్ష్యాల సాధనలో ముసాయిదా సిలబస్ విఫలమవనుందని తెలిపారు. ఇటీవలి చరిత్రలో తలెత్తుతున్న ధోరణులను కూడా చేరుస్తామని ముసాయిదా ప్రస్తావించినప్పటికీ సిలబస్‌లో పేర్కొన్న కోర్, ఎలక్టివ్ కోర్సుల్లో ఎక్కడా అటువంటివి కనిపించలేదని అన్నారు. ప్రాచీన, మధ్యయుగం నాటి భారత చరిత్ర అధ్యయనం చేసేవారి రిఫరెన్స్ జాబితాలో ఆర్.ఎస్.శర్మ, ఇర్ఫాన్ హబీబ్ వంటి ప్రముఖ చరిత్రకారులు చేసిన కృషిని చేర్చలేదని తెలిపారు. ప్రాథమిక మూలాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం వుందంటూ సిలబస్ లక్ష్యాల్లో పేర్కొన్నదానికి ఇది పూర్తి విరుద్ధంగా వుందని అన్నారు.
ఎందుకంటే ఈ ఇద్దరు చరిత్రకారులు విస్తారమైన మూలాలను అన్వేషించి, విశ్లేషించి దేశ చారిత్రక పరిశోధనకు విశేషంగా కృషి చేశారని చెప్పారు. చారిత్రక పరిశోధనల్లోని తాజా అంశాలన్నింటినీ ఈ ముసాయిదా సిలబస్ పూర్తిగా విస్మరించిందని జోసెఫ్ పేర్కొన్నారు.