Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి రైతు సంఘాలు లేఖ
- స్పందించకపోతే ఉద్యమం ఉధృతం ొ రైతులు కరోనాబారిన పడకూడదనే భావనతో ఉన్నాం..
న్యూఢిల్లీ : గత ఆరునెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో అలు పెరగని పోరాటం చేస్తున్న రైతులు..చర్చలకు సిద్ధమని మరోమారు స్పష్టం చేశారు. ఈమేరకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌లకు రైతుసంఘాల వేదిక 'సంయుక్త కిసాన్ మోర్చా' (ఎస్కేఎం) తాజాగా లేఖ రాసింది. ఎండ, వానా, చలిని ఎదుర్కొన్న రైతులు..కరోనా సమయంలోనూ మొక్కవోని దీక్షతో ఉద్యమం చేస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో రైతులు వైరస్‌బారిన పడకూడదన్న అభిప్రాయంతో ఉన్నామని, అయితే భవిష్యత్తు తరాల కోసం ఉద్యమం ఆపే ప్రసక్తిలేదని కేంద్రానికి రాసిన లేఖలో ఎస్కేఎం నాయకులు తెలిపారు. ఇది తమకు 'లైఫ్ అండ్ డెత్' సమస్య అని, రైతుల డిమాండ్లు నెరవేర్చాలని లేఖలో కోరారు. రైతుల ఆందోళనపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎస్కేఎం తెలిపింది. దీనిపై ఈనెల 25కల్లా కేంద్రం నుంచి స్పందన రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని లేఖలో పేర్కొన్నారు.
అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఆరు నెలలుగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దులో సింఘు, టిక్రీ వద్ద అలుపెరగని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 30కిపైగా రైతు సంఘాలు కలిసి ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాయి. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేసిన రోజైన మే 26న బ్లాక్ డేగా ప్రకటించాయి. ఆ రోజు నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలపాలని పిలుపునిచ్చాయి. ఈ నిరసనలో పాల్గొనేందుకు వేలాదిగా ట్రాక్టర్లతో రైతులు ఛలో ఢిల్లీ అంటూ వచ్చారు. మరోసారి ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్తతలు తప్పవని అంతా భావిస్తున్న తరుణంలో..రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చర్చలకు సిద్ధమంటూ ముందుకు వచ్చింది.
ఇప్పటికే 11సార్లు
రైతులకు ప్రభుత్వానికి మధ్య ఇప్పటివరకు 11సార్లు చర్చలు జరిగాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు పట్టుబడుతుండగా, రద్దు చేయడం కుదరదని కేవలం సవరణలే చేస్తామంటూ ప్రభుత్వం భీష్మించుకుంది. దాంతో ఆరునెలలు గడిచినా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. మరోవైపు ఢిల్లీలో ఉండే తీవ్రమైన చలి, ఎండలను తట్టుకోవడంతోపాటు కరోనా సెకండ్ వేవ్ భయపెడుతున్నా సరే..రైతులు ఢిల్లీని వీడకుండా ఆందోళన చేస్తూ తమ పట్టుదలను చాటుకున్నారు. ఇప్పటివరకూ ఉద్యమ స్థలిలోనే 470మందికిపైగా రైతులు తమ ప్రాణాలు అర్పించారు.