Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాక్డౌన్తో ఢిల్లీని వదిలి వెళ్లిన వలస కార్మికులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా రెండో దశ విజృంభణతో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ల బాటలో నడుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సిఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఏప్రిల్ 19 నుంచి లాక్డౌన్ ఆంక్షలను పొడిగిస్తూ వస్తోంది. ఈ నెల రోజుల్లో ఉపాధి నిమిత్తం పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన వారిలో ఎనిమిది లక్షల మందికి పైగా వలస కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లి పోయారని ఢిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా తన నివేదికలో పేర్కొంది. ఏప్రిల్ 19 నుంచి ఈనెల 14 వరకు మొదటి నాలుగు వారాల లాక్డౌన్ నేపథ్యంలో 8,07,032 మంది వలస కార్మికులు ఢిల్లీని వదిలి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారని పేర్కొంది. వీరిలో మొదటి వారంలో అధిక సంఖ్యలో 3,79,604 మంది బస్సులు, రైలు సర్వీసులతోపాటు ఇతర రవాణా సదుపాయాల ద్వారా వెళ్లారని తెలిపింది.
ఆ తరువాతి నుంచి తగ్గుతూ రెండో వారంలో 2,12,448 మంది, మూడో వారంలో 1,22,490 మంది, నాలుగో వారంలో 92,490 మంది వెళ్లిపోయారని నివేదిక పేర్కొంది. వీరికి ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రధానంగా యుపి, ఉత్తరాఖండ్ రాష్ట్రాల రవాణా శాఖ అధికారులతో ఢిల్లీ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరిపిందని ఢిల్లీ రవాణా మంత్రిత్వశాఖ నివేదిక వివరించింది. ఈ నాలుగు వారాల్లో 21,879 అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడిచాయని తెలిపింది. గతేడాది దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో కూడా వలస కార్మికులు పెద్దయెత్తున సొంతూళ్లకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. రవాణా సదుపాయాలు లేక కాలినడకన నానా ఇబ్బందులు పడుతూ చిన్న పిల్లలతో రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న దశ్యాలు కనిపించాయి.