Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లాక్ ఫంగస్ సంకేతం కావచ్చు
- ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా
న్యూఢిల్లీ : 'కోవిడ్ వచ్చి కోలుకున్నా తలనొప్పి తగ్గకుండా వేధిస్తుంటే, లేదా ముఖానికి ఒక వైపు వాపు గనక వున్నట్టయితే వెంటనే డాక్టరును కలిసి బ్లాక్ ఫంగస్ పరీక్ష చేయించుకోవడం మంచిది. నోట్లో నాలుక రంగు మారుతున్నట్టు కనిపించినా, ముఖంలో ఏ భాగంలోనైనా స్పర్శ తగ్గుతున్నా కూడా వెంటనే పరీక్ష చేయించుకోవాల్సిందేనని' ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ముక్కు నల్లబడుతున్నా, పన్ను కదులుతున్నా కూడా అదే పరిస్థితని, ఇవన్నీ తొలి సంకేతాలేనని వెంటనే డాక్టరును కలవాల్సిందేనని చెప్పారు.
'బ్లాక్ ఫంగస్ లేదా మ్యుకరోమైకోసిస్ను నిర్ధారించడానికి చాలా మార్గాలున్నాయి. సైనస్ ఎక్స్‌రే లేదా సిటి స్కాన్ తీస్తే ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుస్తుంది. లేదా ముక్కు ఎండోస్కోపి ద్వారా బయాప్సీ చేయించాలి. పాలిమరైజ్ చెయిన్ రియాక్షన్ (పీసీఆర్) ఆధారిత రక్త పరీక్ష కూడా చేయించవచ్చునని' ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గులేరియా తెలిపారు. భారత్‌లోనే ఈ తరహా కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయన్నారు. ఇది అంటువ్యాధి కానప్పటికీ, దేశంలో మధుమేహ రోగులు ఎక్కువగా ఉండడం, నియంత్రణ లేని రీతిలో స్టెరాయిడ్లను వినియోగించడం వల్ల ఇక్కడ కేసులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. కరోనా తొలి వేవ్‌లో కూడా ఈకేసులు వచ్చాయన్నారు. రెండో వేవ్‌లో స్టెరాయిడ్ల వాడకం పెరగడంతో ఈ కేసులు కూడా ఎక్కువగా వస్తున్నాయన్నారు. 40కి పైన వయసు ఉండి, మధుమేహ రోగులైతే వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పిల్లల్లో దీని ముప్పు చాలా తక్కువగా ఉంటుందన్నారు. వారికి కోవిడ్ ఇన్ఫెక్షన్ చాలా తక్కువగా ఉంటోందని, అందువల్ల స్టెరాయిడ్ల వాడకం కూడా అవసరం లేదని అన్నారు.