Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాలుగు సూత్రాలను ప్రధాని మోడీకి సూచించారు. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్ల నుండి 44 ఏళ్ల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం ఆమోదించింది. అయితే వ్యాక్సిన్ కొరత కారణంగా ఈ నిర్ధేశించిన వయస్సుల వారికి పలు రాష్ట్రాలు టీకా ప్రక్రియను నిలుపుదల చేశాయి. అందులో ఢిల్లీ కూడా ఒకటి. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ...దేశంలో కరోనా ధర్డ్‌వేవ్ కట్టడికి వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేయాలని కోరారు. ఈ మేరకు నాలుగు సూచనలు చేశారు. భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ తయారీ చేసేలా అన్ని వ్యాక్సిన్ ఉత్పత్తిదారులను ఆదేశించాలని కోరారు. దీని నిమిత్తం 24 గంటల్లో వారిని సమావేశపరిచి.. వ్యాక్సిన్ ఉత్పత్తి వేగవంతానికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా విదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు కూడా ...వారి ఉత్పత్తులు తయారు చేసేలా ఆదేశాలివ్వాలని తెలిపారు. విదేశీ వ్యాక్సిన్ మేకర్స్‌తో కేంద్రం చర్చించి, నేరుగా కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే పలు దేశాలు ..తమ జనాభా అవసరాల కంటే భారీగా వ్యాక్సిన్లు కొనుగోలు చేసి ఉంటాయని, వాటిని భారత్‌కు ఇవ్వాలని ఆయా దేశాలను కోరాలని తెలిపారు. విదేశీ తయారీ సంస్థలకు భారత్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు అనుమతినివ్వాలని సూచించారు. ఈ సూచనలతో పాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించారు.
ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి తీసుకున్న డోసులన్నీ వినియోగించామని, శనివారం వినియోగిస్తే...డోసులన్నీ అయిపోతాయని అన్నారు. ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాశామని, వ్యాక్సిన్లు అందు కోగానే... వ్యాక్సిన్ సెంటర్లను తిరిగి తెరుచుకుంటాయని చెప్పారు. ప్రతి నెల 80 లక్షల డోసులు ఢిల్లీకి కావాల్సి ఉండగా..మే నెలకు కేవలం 16 లక్షల డోసులను మాత్రమే అందుకున్నామని చెప్పారు. జూన్ నెలలో ఆ డోసులు సంఖ్యను కేంద్రం తగ్గించినట్లు తెలిపారు. ప్రతి నెల 8 లక్షల డోసు లను ఢిల్లీ తీసుకుంటే...మొత్తం నగరవాసులకు వేసేందుకు 30 నెలల సమయం పడుతుందని చెప్పారు. ఈ లోపల ఎన్ని వేవ్‌లు వస్తాయో, ఎంత మంది చనిపోతారో ఊహించడం కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.