Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ కన్నీరు పెట్టుకోవటంపై రాజకీయ వర్గాల్లో చర్చ
- భావోద్వేగంతో సంక్షోభాన్ని ఎదుర్కోలేరని సూచన
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ కన్నీళ్లు పెట్టుకోవటం వార్తల్లో నిలిచింది. స్వంత నియోజికవర్గం వారణాసిలో కరోనా విజృంభిస్తున్న విషయాన్ని అక్కడి వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానికి తెలియజేశారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ప్రధాని మోడీ భావోద్వేగానికి గురై..కన్నీరుపెట్టుకోవటం మీడియాలో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. సంక్షోభంలో కూరుకుపోయిన సమయాన ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నాయకులు ఇలాగే సెంటిమెంట్‌తో ప్రజల్ని ఊరడిస్తారని, ప్రధాని మోడీకూడా అదే పనిచేశారని విమర్శకులు అన్నారు. భావోద్వేగాలతో, కన్నీళ్లతో సమస్యలు పోవని వారు సూచించారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కాశ్మీర్ ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారని, సీఏఏ చట్టం ఆమోదం పొందిన సమయంలో కోట్లాది మంది ఒక వర్గం ప్రజలు ఆందోళనపడ్డారని, సాగు చట్టాలు, కార్మిక చట్టాలపై రైతులు, కార్మికులు పెద్దఎత్తుననిరసనకు దిగారని...వీటిపై ప్రధాని స్పందించటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భావోద్వేగానికి గురవ్వాల్సిన అంశాలపై ఆయన కఠినంగా వ్యవహరిస్తూ, ఇలా కన్నీరు పెట్టుకోవటాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలని వారు ప్రశ్నించారు.