Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు, డీజీల్‌పై 29 పైసలు పెంపు
- సామాన్యుడి నడ్డివిరుస్తున్న మోడీ సర్కారు
న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. ఒకపక్క మే నెలలో తీవ్రమైన ఎండలు, మరోపక్క నానాటికి పెరుగుతున్న కరోనా కేసులతో పోటీ పడి మరీ ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజగా, లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు, డీజీల్‌పై 29 పైసల చొప్పున ఇంధన ధరలు పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వడ్డింపులతో పెట్రో ధరలు పలు చోట్ల వాహనదారులకు, సామాన్య ప్రజలకు షాకిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.21గా, డీజీల్ ధర రూ. 84.07గా నమోదైంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ దాదాపు సెంచరీ మార్కుకు దగ్గరైంది. దీంతో ధర రూ. 99.49కి చేరుకున్నది. అలాగే, ఇక్కడ లీటర్ డీజల్ ధర రూ. 91.30కు ఎగబాకింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.86కు, డీజీల్ ధర రూ. 88.87కు చేరింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.27, డీజీల్ ధర రూ. 86.91కి చేరుకొని వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నది. ఇటు హైదరాబాద్‌లోనూ పెట్రో ధరలు భగభగమన్నాయి. లీటర్ పెట్రోల్‌పై 18 పైసలు పెరిగి ధర రూ. 96.88గా నమోదైంది. అలాగే, లీటర్ డీజీల్‌పై 29 పైసలు పెరిగింది. దీంతో డీజీల్ ధర రూ. 91.65కు ఎగబాకింది. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రో ధరలు సెంచరీ మార్కును దాటి పరుగులు పెడుతున్నాయి.