Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ రికార్డుల్లో లబ్దిదారుడి పేరులేదు.. ఈ పేరుతో (లబ్దిదారుడి) ఆధార్ అనుసంధానం కాలేదు.. ఈ-పోర్టల్లో (పౌర సరఫరాల శాఖ) లబ్దిదారుడి పేరు అప్డేట్ కాలేదు.. ఇలా రకరకాల కారణాలతో పేదలు, వలస కార్మికులు జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రావటం లేదు. దాంతో 'పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన' (రెండో దశ ఉచిత రేషన్) పథకానికి అనేకమంది దూరమవుతున్నారు. నేడు కోట్లాదిమంది ఉపాధికి దూరంగా కాగా, ఆ విషయం తెలిసీ..పథకాన్ని పకడ్బంధీగా అమలుజేయాలన్న శ్రద్ధ కేంద్రం నుంచి లోపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
- ఉచిత రేషన్ పొందలేకపోతున్న వలసకార్మికులు, దినసరి కూలీలు, బస్తీవాసులు
- రేషన్ కార్డులు లేకపోవటమే ప్రధాన కారణం..
- కార్డులన్నవారికే 'గరీబ్ కల్యాణ్ అన్న యోజన'
- సంక్షోభ సమయాన పేదల్ని ఆదుకోవాలి : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తటంతో మోడీ సర్కార్ ఉచిత రేషన్ పంపిణీపై స్పందించింది. మే, జూన్ రెండు నెలలపాటు 'పీఎం గరీబ్ కల్యాణ్ యోజన' కింద లబ్దిదారులకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలు ఇస్తామని (ఏప్రిల్ 23న) ప్రకటించింది. అయితే పథకం ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో అమలుకావటం లేదని విమర్శలు వెలువడుతున్నాయి. అంతేగాక పథకం పరిధిలోకి కోట్లాది పేదలు రావటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో బియ్యం కోటా విడుదలగాక..మే నెలలో ఉచిత రేషన్ పంపిణీ చేయలేదని వార్తలు వెలువడ్డాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం, గ్రామీణ జనాభాలో 75శాతం జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వస్తారని సమాచారం. అత్యంత పేదలు (అంత్యోదయ అన్నయోజన-ఏఏవై) కేటగిరిలోని కుటుంబాలకు ప్రతినెలా 35కిలోలు, అత్యంత ప్రాధాన్యత కుటుంబాలు (పీహెచ్హెచ్) కేటగిరిలోని లబ్దిదారుడికి ప్రతినెలా 5కిలోల రేషన్ సరుకుల్ని అందజేయాలి. లబ్దిదారుల గుర్తింపు అంతా కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే చూసుకోవాలి. ఏఏవై పథకం పరిధిలోకి రానివారిని 'పీహెచ్చ్' విభాగంలో చేర్చాలని తద్వారా వారికి రేషన్ సరుకులు అందజేయాలని 'జాతీయ ఆహార భద్రతా చట్టం'లో రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. అయినా దీనిపై పాలకులు శ్రద్ధ చూపటం లేదు.
అనేక మందికి రేషన్ కార్డులే లేవు
పెద్ద పెద్ద నగరాల్లో వలసకార్మికులు ఉపాధిలేక ఆకలితో అలమటిస్తున్నారు. వీరిలో చాలామందికి జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు కావటం లేదు. రేషన్ కార్డులు లేక..అష్టకష్టాలు పడుతున్నారు. కేంద్రం ప్రస్తుతం అమలుజేస్తున్న 'పీఎం గరీబ్కల్యాణ్ యోజన' వర్తించాలంటే రేషన్ కార్డుండాల్సిందే. అందుకే..ఈ విషయంలో సుప్రీంకోర్టు కలుగుజేసుకొని ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. రేషన్ కార్డులు లేకున్నా వలస కార్మికులు, దినసరి కూలీలకు ఉచిత రేషన్ తప్పనసరిగా అందజేయాలని సుప్రీం పేర్కొంది. ఇంకొక విషయం ఏమంటే, 2011 జనాభా ఆధారంగా లబ్దిదారులను పరిగణలోకి తీసుకొని కేంద్రం రేషన్ కోటాను విడుదల చేస్తోంది. 2021నాటికి దేశంలో పేదల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వీరందరూ పథకం ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.
- దీపా సిన్హా, సామాజిక కార్యకర్త, ఢిల్లీ
నాణ్యత లేని రేషన్ పంపిణీ
నాణ్యతలేని బియ్యాన్ని లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. నూక బియ్యం, ముక్కిన బియ్యం..కలగలిపి వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది పేదలకు నాణ్యతలేని రేషన్ సరుకులు అందుతున్నాయి. నగరంలో అనేక చోట్ల బస్తీలున్నాయి. ఇక్కడ నివసిస్తున్న పేదల్లో చాలా కుటుంబాలకు అసలు రేషన్ కార్డులే లేవు. ఏఏవై, పీహెచ్హెచ్ కింద రేషన్ సరుకులు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వలస కార్మికులు, దినసరి కూలీలు, స్థానికంగా ఉండే ఎంతోమంది పేదలు ఆహార భద్రతకు దూరమవుతున్నారు.
- డాక్టర్ యాసిర్, సామాజిక కార్యకర్త హైదరాబాద్