Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగని కరోనా మరణాలు ..
- ఈ నెలలో 77 లక్షల కేసులు, 90 వేల మంది మృతి
- అయినా పరిస్థితి సాధారణంగానే ఉంటుందంటున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. కనీస వైద్యం అందక అందక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య సైతం అధికంగానే ఉంటోంది. ఈ ఒక్కనెలలోనే ఇప్పటివరకు మొత్తం 77 లక్షల కేసులు, 90 వేల మరణాలు సంభవించాయి. ఈ గణాంకాలు చాలు దేశంలో కరోనా ఏ స్థాయిలో పంజా విసురుతున్నదనేది తెలియజేయడానికి. అయితే, ప్రభుత్వం మాత్రం కరోనా పరిస్థితి సాధారణంగానే ఉందని చెబుతుండటం గమనార్హం. ''దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా తగ్గుతోంది. పరిస్థితులు మాములు స్థితికి చేరుకుంటున్నాయి. మరణాల రేటు, పాజిటివిటీ రేటు సహా యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. రికవరీ రేటు పెరుగుతోంది'' అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా, గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2.4 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో వరుసగా ఏడో రోజు 3 లక్షలకు లోపు కరోనా కేసులు వెగులుచూశాయి. అయితే, మరణాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా 3,741 మంది వైరస్ కారణంగా మరణించారు. దీంతో మొత్తం మరణాలు 2,99,266కు పెరిగాయి. మొత్త పాజిటివ్ కేసులు 2,65,30,132కు చేరాయి. 28,05,399 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,34,25, 467 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 88.30 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.13 శాతం, పాజిటివిటీ రేటు 13.6 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 32,86,07,937 కరోనా నిర్థారణ పరీక్షలతో పాటు 19.49 కోట్ల కోవిడ్-19 టీకాలు వేశారు. మే నెలలో 77 లక్షలకు పైగా కరోనా కేసులు, 90 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఇక ఏప్రిల్లో 66.13 లక్షలు, మార్చిలో 10.25 లక్షల కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దేశంలోని పలు జిల్లాల్లో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్నప్పటికీ, 382 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగానే ఉందని కేంద్రం తెలిపింది. నిటి అయోగ్ సభ్యులు డాక్టర్ వికె.పాల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగానే కరోనా ప్రభావం కాస్త తగ్గిందన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా ప్రభావం సాధారణ స్థితికి వస్తోంది. కానీ పలు ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు అధికంగానే ఉండటం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. కరోనా కట్టడి కోసం అలసత్వం లేకుండా మరిన్ని మెరుగైన చర్యలు తీసుకుంటూ ఇంకా చాలా దూరం వెళ్లాల్సిన అవసరముందని తెలిపారు.