Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నాయకుల అశాస్త్రీయ పోకడలు
- ప్రమాదంలో ప్రజలప్రాణాలు : విశ్లేషకులు
దేశాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ విషయంలో మోడీ సర్కారు అనుసరిస్తున్న హిందూత్వ అహేతుక విధానాలు వైరస్‌పై యుద్ధాన్ని సంక్లిష్టం చేస్తున్నది. ఆయుశ్మంత్రిత్వ శాఖతో పాటు బీజేపీ నాయకులు అనుసరిస్తున్న అశాస్త్రీయ విధానాలు, అవి ప్రజల ప్రాణాలను హరిస్తున్న తీరు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు ప్రకటిస్తున్న అశాస్త్రీయ విధానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవా లన్నదానిపై ఈనెల ప్రారంభంలో కేంద్రం ఇక వివరణాత్మక సలహా ఇచ్చింది. నువ్వుల నూనె, కొబ్బరినూనె, ఆవు నెయ్యి... ఇలా కొన్నింటిని సూచిస్తూ వాటిని నాసికా రంధ్రాల్లో వేయాలని ఆయుశ్ మంత్రిత్వ శాఖ సూచించింది. అలా కుదరకపోతే నోటి ద్వారా తీసుకునే విధానం గురించి కూడా వివరించింది. అలాగే, కరోనా మన దగ్గరకు రాకుండా చవ్యన్ప్రాశ్ తినడం, మూలికా టీ తాగడం, ఆవిరి పీల్చడంతో పాటు మొదలైన ఇతర చర్యలను ఆయుశ్ మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. తాము చేసిన ఈ సూచనలు పాటించేవారు కోవిడ్-19 బారిన పడరని స్పష్టం చేయటం గమనార్హం.
ఈ శతాబ్దపు అత్యంత ప్రాణాంతక వ్యాధి అయిన కరోనా మహమ్మారి విషయంలో, పూర్తిగా శాస్త్రీయ ఆధారాలు లేని నివారణా పద్ధతుల్ని, అశాస్త్రీయ విధానాల్ని బీజేపీ నాయకులు సూచిస్తున్నారు. కర్నాటకలో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ విజరు సంకేశ్వర్.. ఆక్సిజన్‌కు ప్రత్యామ్నాయంగా సున్నం రసం పీల్చాలని చెప్పారు. నాసికా రంధ్రాల ద్వారా సున్నం రసాన్ని ఇవ్వడంతో ఆక్సిజన్ స్థాయి 80 శాతం పెరిగిందని సంకేశ్వర్ ఇటీవల ప్రెస్మీట్లో చెప్పారు. దీనిని ఆయన బంధువులు, సహచరులతో సహా 200 మందిలో ఈ హోమ్ రెమిడీగా ఉపయోగించి చూశామని ఆయన అన్నారు. అయితే, సదరు రాజకీయ నాయకుడి సలహాలను పాటించడం ద్వారా ఆయన అనుచరులు, అనేక మంది ప్రాణం మీదకు తెచ్చుకున్నారని తెలిసింది.
కర్నాటకకు చెందిన మరో బీజేపీ నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ కరోనాపై పోరాటానికి ఆవిరి పీల్చాలని సిఫారసు చేశారు. అంతేకాకుండా, దీనికి సంబంధించి పోలీసుల చిత్రాలను కూడా ఆయన పోస్టు చేయడం గమనార్హం. అలాగే, మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్.. ''హవాన్'' అని పిలువబడే పురాతన అగ్ని కర్మ.. మహమ్మారిని ఎదుర్కోవడానికి సమర్థవంతమైన మార్గం అని వెల్లడించారు. అలాగే, భోపాల్‌కు చెందిన ఎంపీ తాను ఆవుమూత్రం తాగడం కారణంగానే కోవిడ్ బారిన పడలేదని చెప్పటం వార్తల్లో నిలిచింది. ఇక మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కొందరు సాధువుల బృందం.. తాము రోజూ ఆవుపేడను శరీరానికి రాసుకోవడం ద్వారా కరోనా దరిచేరదని వాదించడం గమనార్హం. ఇలాంటి అశాస్త్రీయ, అహేతుకమైన విధానాలతో మోడీ సర్కారు, ప్రధాని అనుచరగణం, బీజేపీ నాయకులు 'హిందూత్వ ఆచరణ పద్దతుల' పేరుతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని వైద్య నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు.