Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో ఎల్ఎంవోకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలో ప్రాణాలు పోకుండా కాపాడే ఆక్సిజన్ (ఎల్ఎంవో)కు రికార్డు స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. ఈ కొరతను అధిగమించడానికి విదేశాల నుంచి సైతం దిగుమతులను ప్రభుత్వం పెంచింది. అయితే, ఇప్పటికీ ఆక్సిజన్‌కు డిమాండ్ తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, గత 72 రెండు గంటల్లో మాత్రం ఆక్సిజన్ వినియోగం కాస్త తగ్గిందనీ, దాదాపు నెలరోజుల్లో మొదటిసారి తగ్గుదల చూపుతోందని అధికారులు చెబుతు న్నారు. ద్రవ రూప ఆక్సిజన్ వాస్తవ వినియోగం రోజుకు 8,900 మెట్రిక్ టన్నుల నుంచి 8000 మెట్రిక్ టన్నులకు పడిపోయిందని తెలిపారు. కానీ గతేడాది కరోనా సంక్షోభంతో పోలిస్తే ఇది రికార్డు స్థాయి అనీ.. డిమాండ్ అధికంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఆక్సిజన్ సరఫరాపై నియమించబడిన సాధికార బృందం నిర్వహిస్తున్న డేటా ప్రకారం... రికార్డు స్థాయిలో మే 9న 8,944 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశారు. మే 18-19 నాటికి ఇది 8,100 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. ఇక మే 20న 8,334 మెట్రిక్ టన్నులకు పెరిగింది. అయితే, కరోనా ఫస్ట్‌వేవ్‌లో ఎల్ఎంవో గరిష్ట అమ్మకం రోజుకు 3,095 మెట్రిక్ టన్నులుగా (29 సెప్టెంబర్ 2020) ఉంది. ఈ ఏడాది మార్చి 31న ఎల్ఎంవో అమ్మకం రోజుకు 1,599 మెట్రిక్ టన్నులుగా ఉంది. అయితే, ఆ తర్వాతి వారాల్లో కరోనా కేసులు పెరగడంతో డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగింది. ఏప్రిల్ 30న ఏకంగా 8000 మెట్రిక్ టన్ను ల మార్కును దాటుతూ క్రమంగా పెరిగింది. మే 17న గరిష్టంగా 8,900 మెట్రిక్ టన్నులకు చేరింది. ప్రస్తుతం నిత్యం 8 వేల మెట్రిక్ టన్నుల దగ్గరగా కొనసాగుతోంది. ప్రభుత్వ డేటా ప్రకారం.. దాదాపు 50 వేల మంది కోవిడ్-19 రోగులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉన్నారు. వెంటిలేటర్‌పై 14,500 మంది ఉండగా, ఆక్సిజన్ సపోర్టుపై 1.37 లక్షల మందికి పైగా రోగులు ఉన్నారు. కరోనా ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఆక్సిజన్‌కు అధికంగా డిమాండ్ ఉన్న రాష్ట్రాల జాబితాలో ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లు టాప్‌లో ఉన్నాయి.