Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాజిటివ్ క్యాంపెయిన్ పేరుతో ఎదురుదాడి
ముంబయి : కరోనాను కట్టడి చేయడంలో దారుణంగా విఫలమైన కేంద్ర ప్రభుత్వం, పరిస్థితిని చక్కదిద్దేబదులు, తాజాగా ''ఎదురుదాడి'' వ్యూహం అమలు చేయడం ప్రారంభించింది. ఇందుకోసం ఇటీవల మే11 నుంచి ఆరెస్సెస్ అయిదు రోజుల పాటు సదస్సు నిర్వహించింది. అందులోపలువురు ప్రభుత్వాధికారులు, బీజేపీ నాయకులతోబాటు శ్రీశ్రీ రవిశంకర్, సద్గురు జగ్గీ వాసుదేవ్ వంటి ఆధ్యాత్మిక గురువులు కూడా పాల్గొన్నారు.
''భారతదేశం కరోనాను జయించింది'' అని జనవరి 16న గొప్పగా ప్రకటించిన అనంతరం అయిదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో విజయం సాధించడమే లక్ష్యంగా మోడీ సేన బయలుదేరింది. మతవిశ్వాసాలకు భావోద్వేగాన్ని కలగలిపి రెచ్చగొట్టి విద్వేషపూరితంగా వాతావరణాన్ని మార్చి దాని ఆధారంగా ఓట్లు, సీట్లు పొందాలనే వ్యూహాన్ని అమలుచేసింది. కుంభమేళాను ఒక ఏడాది ముందుకు జరిపి మరీ నిర్వహించింది ఇందు కోసమే. ధనబలాన్ని విచ్చలవిడిగా ప్రదర్శించింది. ఎన్నికల కమిషన్ సైతం బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించింది. ఎన్ని చేసినా ఎన్నికలలో బీజేపీ చతికిలబడింది.
దేశంలో మార్చి నెలనుంచి విజృంభించిన కోవిడ్-19 ను అరికట్టడం కోసం ముందస్తుగానే పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా కేంద్రం పట్టించుకోలేదు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలపరిచి అవసరమైన సంఖ్యలో పడకలు, ఆక్సిజన్, ఔషధాలు అందించే ముందస్తు ఏర్పాట్లేవీ లేవు. మరీ ముఖ్యంగా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం ఘో రంగా విఫలమైంది. ఈ వైఫల్యాలను దేశీయంగా, అంతర్జాతీయంగా మీడియా తీవ్రంగా ఎండగ ట్టింది. గంగానదిలో కొట్టుకువస్తున్న మృతదేహాలు కేంద్ర ప్రభుత్వపు చేతకానితనాన్ని, అమానవీయ తను ఎత్తిచూపాయి. ప్రజల ప్రాణాలకన్నా సెంట్రల్ విస్తా నిర్మాణమే మోడీకి ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నారు బాధిత ప్రజానీకం. ఈ పరిస్థితుల్లో చేయిదాటిపోయిన పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు చేపట్టేబదులు బీజేపీ, ఆరెస్సెస్ కరోనా విషయంలో ఈ దారుణ వైఫల్యాలకు రాష్ట్రాలను, అధికారులను, చివరకు ప్రజలను సైతం బాధ్యుల్ని చేస్తూ గోబెల్స్ తరహా ఎదురుదాడి ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రధాని ముందునుంచీ హెచ్చరిస్తున్నా ప్రజలు జాగ్రత్తలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కరోనా విస్తరించడానికి కారణం అయిందని, ప్రధాని హెచ్చరికలను పట్టించుకుని రాష్ట్రాలు గనక ముందస్తుగా చర్యలు చేపట్టివుంటే ఆక్సిజన్ కొరత ఏర్పడివుండేది కాదని, వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు ముందునుంచీ ఉత్పత్తి ప్రారంభించివుంటే వ్యాక్సిన్ కొరత వచ్చివుండేది కాదని - ఇలా ఇతరులను బాధ్యుల్ని చేస్తూ ఇందులో మోడీది ఏ వైఫల్యమూ లేదని చెప్పడానికి వీలైన ప్రచార వ్యూహాన్ని రూపొందించారు. ఈ వ్యూహాన్నే మన రాష్ట్రంలో సైతం బీజేపీ నేతలు ప్రారంభించారు. మార్చి నెల నుంచి మే 20 దాకా కోవిడ్ విషయంలో మౌనంగా ఉండిన రాష్ట్ర బీజేపీనేతలు రాష్ట్ర ప్రభు త్వ వైఫల్యం వలనే కరోనా ఇంతగా వ్యాపించిందని హఠాత్తుగా ఇప్పుడే గుర్తించినట్టు విమర్శలు ప్రారంభించారు.
మేనెల ప్రారంభంలోనే సోషల్ మీడియా ద్వారా, పత్రికా ప్రకటనలద్వారా కోవిడ్ పై పోరులో అమోఘమైన నాయకత్వం అందిస్తున్న మోడీ ని ప్రశంసిస్తూ ప్రచారం చేపట్టడానికి పథకం రూపొందించారు. మే 4 వ తేదీన దాదాపు 300 మంది జాయింట్ సెక్రెటరీల హోదాలో ఉన్న అధికారులతో వర్క్‌షాప్ నిర్వహించి ప్రధాని మోడీ పాత్రను ప్రముఖంగా చిత్రీకరించాలని ఆదేశిం చారు. ''ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్''అన్న పేర ఈ వర్క్‌షాప్‌ను ''మై గవర్నమెంట్'' అనే కేంద్ర ప్రభుత్వ వేదిక సీఈఓ అభిషేక్ సింగ్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విజయాలను వివరించే ''పాజిటివ్'' కథనాలను ప్రముఖంగా ప్రచారం చేయాలని నిర్దేశించారు. మోడీప్రభుత్వం జోక్యమే గనుక లేకపోయివుంటే కరోనా ఇంకా తీవ్రంగా విజృంభించివుండేదన్నట్టు ప్రచారం ఉండాలని, కోలుకున్న వారి కథనాలను బాగా ప్రచారంలో పెట్టాలని కూడా సూచించారు. ప్రభుత్వరంగ సంస్థలు, స్నేహపూర్వకంగా ఉండే ప్రయివేటు కంపెనీలతో మోడీ పాత్రను శ్లాఘిస్తూ హోర్డింగ్ లు, ప్రకటనలు భారీగా తీసుకురావాలని ఆదేశించారు. ''మనం ప్రేమించేవారినెందరినో ఈ కరోనా తీసుకుపోయింది'' అంటూ మోడీ మీడియా ముందు కళ్ళనీళ్ళు పెట్టుకోవడం (మే 21), జహాు బీమార్, వహాు ఉపచార్ అని ఆరోగ్య కార్యకర్తలకు ఆదేశాలివ్వడం (మే 21), కోవిడ్ వ్యాక్సిన్ ను వృధా చేయవద్దు అంటూ రాష్ట్రాలకు విజ్ఞప్తి (మే 20), 10 రాష్ట్రాల జిల్లా కలెక్టర్లతో మోడీ నేరుగా సమావేశం నిర్వహించడం (మే 20), వంటివి ఈ వ్యూహంలో భాగమే!
తమ ప్రభుత్వం పై దుష్ప్రచారానికి కాంగ్రెస్ ఒక టూల్ కిట్ రూపొందించిందని ఆరోపిస్తూ ఒక కేంద్ర మంత్రి స్వయంగా ట్వీట్ చేయడం మోడీ సైన్యం సోషల్ మీడియా వ్యూహంలో భాగమే. ఎటొచ్చీ ఆట్వీట్ ను '' మానిప్యులేటెడ్'' ( అవాస్త వికమైనది ) అన్న ట్యాగ్ తో ట్విట్టర్ సూచించడంతో ఈ కుట్ర బట్టబయలైంది. అయినా అక్కసు పట్టలేక కేంద్ర ఐటీ మంత్రి ఆ ట్యాగ్‌ను తొలగించాలని ట్విట్టర్ ను ఆదేశించారు. ఆ ఆదేశాన్ని ట్విట్టర్ ఇంతవరకూ ఖాతరు చేయలేదు. మొత్తం మీద ఈ ప్రచార వ్యూహం బెడిసికొట్టేటట్టే కనపడుతోంది.
ఇటీవల 13 ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధానికి కోవిడ్‌ను కట్టడి చేసే చర్యలపై రాసిన లేఖ కేంద్రం బాధ్యత ఏమిటో స్పష్టం చేసింది.
''ప్రజలప్రాణాల కన్నా సెంట్రల్ విస్తా నిర్మాణమే మోడీ కి ముఖ్యమా ?''
''దేశంలో అన్ని వ్యాక్సిన్ కంపెనీలకూ వ్యాక్సిన్ ఉత్పత్తికి లైసెన్సులు ఎందుకివ్వరు ? ''ప్రయివేటు ఆస్పత్రులకు నేరుగా అమ్ముకోడా నికి వ్యాక్సిన్ ఉత్పత్తిదారులను ఎందుకు మోడీ అనుమతించారు ?'' ''అందరికీ ఉచిత వ్యాక్సిన్ కేంద్రమే అందించాలి'' కేంద్ర బడ్జెట్లో వ్యాక్సిన్ కోసం కేటాయించిన రు.35000 కోట్లు వెంటనే విడుదల చేయాలి '' వంటి ప్రజల డిమాండ్లు మోడీ ప్రచార వ్యూహానికి బలంగా సవాలు విసురుతున్నాయి.
కరోనా నివారణలో ఘోరంగా విఫలమైన బీజేపీి ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయాలని కాషాయ పార్టీ వేసిన ఎత్తుల్లో ఇదొకటి. కరోనా బాధితులకు సహాయం చేసే పేరుతో తన సొంత ప్రచారం చేసుకునేందుకు కాంగ్రెస్ ఎంతకు దిగజారిందో మీరే చూడండి అని ట్వీట్ చేసి..కాంగ్రెస్ లెటర్ హెడ్ అంటూ ఒక కాపీని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంవిత్ పాత్ర పోస్టు చేశారు. ఆయనతో పాటు పదుల సంఖ్యలో బీజేపీ నేతలు ఇలాగే ట్వీట్ చేశారు. ఈ లెటర్ హెడ్ నకిలీదని తేలడంతో ట్వీట్టర్ వారి పోస్టులకు 'మ్యానిప్యులేటెడ్ మీడియా' అని ట్యాగ్ చేసింది. అంటే అది తప్పుడు సమాచారం అని నిర్ధారించడం.