Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వచ్చే ఏడాది మరిన్ని స్థానాలు కోల్పోనున్న బీజేపీ
- పలు రాష్ట్రాల్లో మారిన సమీకరణలు
న్యూఢిల్లీ : రాజ్యసభలో మెజార్టీ మార్క్ సాధించడం బీజేపీ ప్రభుత్వానికి రెండో టర్మ్‌లోనూ కలగానే ఉండనుంది. పలు రాష్ట్రాల్లో మారిన, మారనున్న సమీకరణల నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న అంకెను నిలబెట్టుకోవాలన్నా త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దక్కనున్న ఫలితం కీలకం కానుంది. 245 స్థానాలున్న రాజ్యసభలో బీజేపీకి 93 మంది ఎంసీలు ఉన్నారు. మెజార్టీ మార్క్ 123కు కాషాయ పార్టీ ఇంకా 30 స్థానాల దూరంలో ఉంది. ట్రిపుల్ తలాక్ బిల్లు, జమ్ముకాశ్మీర్ పున్ణవ్యవస్థీకరణ బిల్లు, పౌరసత్వ సవరణ వంటి బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు బీజేపీ సర్కార్ ఇతర పార్టీలకు చెందిన అర డజనకుపైగా ఎంపీలను అప్రజాస్వామిక పద్ధతుల్లో తనకు మద్దతుగా మార్చుకున్న విషయం తెలిసిందే. 2022లో రాజ్యసభ ఎంపీలు మూడు విడతలుగా పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్‌లో 18 మంది, జూన్‌లో 20 మంది, జులైలో 33 మంది చొప్పున రిటైర్ కానున్నారు. కొత్తగా ఎన్నికలు జరిగిన తర్వాత పలు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణల మార్పుల నేపథ్యంలో సభలో పార్టీల బలాబలాలు పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఉన్న స్థానాలు కోల్పోయేట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఇక్కడ బీజేపీ చేతిలో ఉన్న మూడు స్థానాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపికి వెళ్లనున్నాయి. 2019, జూన్‌లో ఏపీలో టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపిలు బిజెపిలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే.
రాజస్థాన్‌లో వచ్చే ఏడాది జులైలో బీజేపీ చేతిలో ఉన్న నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ నుంచి ఎటువంటి తిరుగుబాటు పరిణామాలు చోటుచేసుకోకుంటే ఆ పార్టీకి మూడు స్థానాలు దక్కే అవకాశం ఉంది. చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఒక స్థానం కోల్పోనుంది. యూపీలో 11 స్థానాలు ఖాళీ కానున్నాయి. బీజేపీకి ఉన్న ఐదు స్థానాలను నిలబెట్టుకోవాలవంటే గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న ఎన్నికల్లో ఫలితాలు రావాల్సి ఉంటుంది. నూతన వ్యవసాయ చట్టాలపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో పంజాబ్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. అక్కడ ఎన్నిక జరగనున్న ఒక్క స్థానంలో బీజేపీ పరాజయం పాలవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీతో పాటు మిత్రపక్షాలపైనా ఈ ధపా రాజ్యసభ ఎన్నికలు ప్రభావం చూపనున్నాయి. తమిళనాడులో ఇటీవల అన్నాడింఎకె ఓడిపోయి డీఎంకే అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం రాజ్యసభలో అన్నాడీఎంకేకు ఆరుగురు, డీఎంకేకు ఏడుగురు ఎంపీలు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాటిలో రెండింట్లో డీఎంకే గెలుపొందే అవకాశం ఉంది. తమిళనాడుకు సంబంధించి వచ్చే ఏడాది జూన్‌లో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఈ రెండు పార్టీలకు రెండేసి స్థానాలు దక్కుతాయి.