Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహజత్వాన్ని రక్షించకపోతే జీవ మనుగడకు ప్రతికూలం
- ఇప్పటికే అంతరించే ప్రమాదంలో జంతుజాలం
న్యూఢిల్లీ: ప్రకృతి ప్రమాదంలో పడింది. కొన్నేండ్లు మానవ చర్యల కారణగా ప్రకృతి సహజత్వం తగ్గిపోతుండటంతో జీవుల మనుగడ ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూ గ్రహంపై జీవ మనుగడ కష్టమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాల పారీస్ ఒప్పందం కాగితాలకే పరిమితం కావడంతో జీవజాతి చరిత్రలోనే పెను ప్రమాదకరంగా లక్షల జీవజాతుల మనుగడ కష్టంగా మారింది. మంచి నీటి జాతులలో దాదాపు మూడింట ఒక వంతు అంతరించిపోతున్నాయి. 40 శాతం ఉభయ చరాలు, 84 శాతం పెద్ద క్షీరదాలు, మూడవ వంతు రీఫ్ బిల్డింగ్ కొరల్స్, మూడింట ఒకవంతు ఓక్ ట్రీస్, ఖడ్గ మృగాలు, ఏనుగులు భయంకర స్థాయిలో తగ్గిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2034 నాటికి ఇవి పూర్తిగా అంతరించిపోగలవు. అక్రమ చేపల వేట, వలలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, పురుగుల మందులు, నీటి పారుదల చర్యల కారణంగా మెక్సికోలోని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో జీవ జాతుల మనుగడ కష్టంగా మారింది. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఇదే పరస్థితి నెలకొంది. మన జీవిత కాలంలో 1,30,000 వృక్షజాతులు అంతరించిపోనున్నాయి. మొత్తంగా భూమిపై జంతు, వృక్ష జాతులలో 28 శాతం ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయని జీవావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు. రాబోయే కాలంలో ఈ వినాశనం ఇలాగే కొనసాగితే ప్రకృతి ప్రమాదంలో పడి.. భూమిపై జీవ మనుగడ కష్టంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
ఇటీవల సంవత్సరాలలో జీవ జాతుల క్షీణత వేగంగా సంభవించింది. వన్య ప్రాణుల్లో దాదాపు 60 శాతం గత 50 సంవత్సరాలలో తగ్గిపోయింది. రాబోయే దశాబ్దంలో ప్రకృతి రక్షణ చర్యలు తీసుకోకపోతే 1 మిలియన్ కంటే ఎక్కువ జాతులు భూమిపై శాశ్వతంగా అదృశ్యం కావచ్చునని శాస్త్రవేత్తలు హెచ్చిరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అడవుల నరికివేత, ఆహారం కోసం అధికంగా జీవజాలం వేటకు గురికావడం, ఇంధనాలు, ఖనిజాలు, నగర నిర్మాణాల కోసం ప్రకృతిని ధ్వసం చేయడం, జంతు జాల ఆవాసాలను సైతం మానవులు ఆక్రమించడమేనని పేర్కొంటున్నారు. దీనికి తోడు నీటిలో కలుస్తున్న రసాయనాలు జలాల్లో వుండే జీవులకు శాపంగా మారిందని చెబుతున్నారు. జీవ జాతులు వేగంగా అంతరించిపోకుండా నిరోధించడంతో పాటు జీవవైవిధ్యాన్ని రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ శాస్త్రవేత్తల బృందం ''గ్లోబల్ డీల్ ఫర్ నేచర్'' (జీడీఎన్) అధ్యయనాన్ని ప్రచురించింది. ఇందులో ప్రకృతి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించింది. 2030 నాటికి ప్రకృతి సహజత్వాన్ని 30 శాతం రక్షించడం లక్ష్యంగా (30లి30 విజన్)పెట్టుకోవాలని సూచించింది.