Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో ఆగని కరోనా మృత్యుఘోష
- ప్రపంచంలోనే మరణాల్లో భారత్ మూడవ స్థానం
- కరోనాతో 1,15,000 మంది వైద్యారోగ్య సిబ్బంది మృతి : డబ్ల్యూహెచ్‌వో
- బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదు: డా.రణదీప్
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి మృత్యుఘోష ఆగడం లేదు. తీవ్ర స్థాయిలో పంజా విసురుతున్న వైరస్ నిత్యం వేల మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. దీంతో దేశంలో కరోనా మరణాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,454 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాలు 3,03,720కి పెరిగాయి. ఇదే సమయంలో కొత్తగా 2,33,315 మందికి వైరస్ సోకడంతో మొత్త పాజిటివ్ కేసులు 2,67,52,447కు చేరాయి. కాగా, తాజాగా సిక్కింలో 100 మంది బౌద్ధ సన్యాసులు కరోనా బారినపడ్డారు.
అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్..
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాప్తి కోనసాగుతోంది. అయితే, భారత్‌లో ఉన్నంతగా కరోనా ప్రభావం మరేదేశంలోనూ లేదు. ఇక కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్.. మరణాల్లో మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో మెక్సికో, యూకే, ఇటలీ, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, కొలంబియా దేశాలు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 167,653,596 కరోనా కేసులు, 3,480,642 మరణాలు సంభవించాయి.
ప్రపంచవ్యాప్తంగా భయానక పరిస్థితులు : డబ్ల్యూహెచ్‌వో
కరోనా సునామీతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. సెకండ్‌వేవ్‌లో కరోనా మరణాలు భారీ సంభవిస్తున్నాయని పేర్కొంది. కరోనా కట్టడి పోరులో ముందున్న ఆరోగ్య సిబ్బంది భారీగా వైరస్ బారినపడుతున్నారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,15,000 మంది వైద్యారోగ్య సిబ్బంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ తెలిపారు.
బ్లాక్‌ఫంగస్‌తో భయమొద్దు !
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారిలో బ్లాక్‌ఫంగస్ భయాందోళనలు రేపుతోంది. ఈ నేపథ్యంలోనే బ్లాక్‌ఫంగస్‌పై అనేక పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా దీనిపై ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోర్‌మైసిస్ అంటువ్యాధి కాదనీ, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని అన్నారు. ఇప్పటికీ గుర్తించిన కేసుల్లో 90-95 శాతం రోగులు డయబెటీస్ కలిగి ఉన్నారనీ, స్టెరాయిడ్లు ఎక్కువగా ఇచ్చిన వారికి సోకే అవకాశముందని వెల్లడించారు. కాగా, దేశలో 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర మంత్రి హర్షవర్థన్ వెల్లడించారు.