Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానాలోని హిస్సార్‌లో భారీ ర్యాలీ
హిస్సార్: హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీవ్ర అణచివేత చర్యలను నిరసిస్తూ అన్నదాతలు కదంతొక్కారు. హిస్సార్‌లో ఇటీవల ఖట్టర్ పర్యటన సందర్భంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేపట్టిన రైతులపై పోలీసులు కర్కశ దాడి చేసిన సంగతి తెలిసిందే. వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా రైతులందరినీ లాఠీలతో చావబాదారు. రాళ్లు విసిరి రక్తకారేలా దాడికి దిగారు. నాటి దాడిలో వందలాది మంది రైతులు గాయపడ్డారు. అంతేకాదు ఆందోళనలో పాల్గొన్న 350 మంది రైతులపై అక్రమంగా కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో అక్రమ కేసులు కొట్టివేయాలనీ, ఖట్టర్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు సోమవారం
భారీ ప్రదర్శన చేపట్టారు. మయార్ టోల్ ప్లాజా నుంచి హిస్సార్ వరకు ఈ మహా ప్రదర్శన సాగింది. ట్రాక్టర్లు, బైకులు, కార్లతో దాదాపు 20 వేల మంది రైతులు ప్రదర్శనలో పాల్లొన్నారు. హిస్సార్ లోని క్రాంతి మాన్ పార్క్ వద్దకు ప్రదర్శన చేరుకొని హిస్సార్ కమిషనర్ కార్యాలయాన్ని ఘెరావ్ చేశారు. వేలాది రైతులు అక్కడ బైటాయించారు. హర్యానా ప్రభుత్వం ఆదివారం నుంచి భారీ పోలీసు బలగాలను, ఆర్ఏఎఫ్ను మోహరించి రైతులను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ రైతులు మాత్రం భారీగా చేరుకున్నారు. హిస్సార్ వద్ద రైతుల నిరసనను నిరోధించడానికి 3,000 మందికి పైగా పోలీసులను ఖట్టర్ ప్రభుత్వం మోహరింపజేసింది. ఈ ప్రతిబంధకాలన్నిటినీ చేధించుకొని అన్నదాతులు మహార్యాలీని దిగ్విజయంగా చేపట్టడం విశేషం. ఈ సందర్భంగా ''మోడీ నహీ కిసాన్ జితేగా, కిసాన్ మజ్దూర్ ఏక్తా జిందాబాద్, జై జవాన్ జై కిసాన్, కిసాన్ ఏక్తా జిందాబాద్, రైతు వ్యతిరేక మోడీ ప్రభుత్వం డౌన్ డౌన్, రైతు వ్యతిరేక ఖట్టర్ డౌన్ డౌన్'' అంటూ నినాదాలను రైతులు హోరెత్తించారు. కాంత్రి మాన్ పార్క్ వద్ద జరిగిన బైటాయింపులో రైతులను ఉద్దేశించి సంయుక్త కిసాన్ మోర్చా నేతలు రాజేవాలా, చాదునీ, రాకేశ్ తికాయిత్, అశోక్ ధావలే, ఉగ్రహాన్, కుల్వాంత్ సంధు తదితరులు మాట్లాడారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రంలోని మోడీ సర్కార్, హర్యానాలోని బీజేపీ-జేజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలపైన దాడి చేయడం అమానవీయమన్నారు. మోడీ, ఖట్టర్ ప్రభుత్వాలకు మానవత్వం లేవని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం దాదాపు ఆరు నెలలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో రోడ్లపైనే రైతులు ఆందోళన చేస్తుంటే...మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా మోడీ సర్కార్ చర్చలు ప్రారంభించాలని హితవు పలికారు.
దిగొచ్చిన హిస్సార్ పోలీసు కమిషనర్
మహా ప్రదర్శన చేపట్టడంతో సంయుక్త కిసాన్ మోర్చా నేతలను, హిస్సార్ పోలీసు కమిషనర్ చర్చలకు పిలిచారు. చర్చలకు వెళ్లిన నేతలు 350 మంది రైతులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు గంట సేపు జరిగిన చర్చల అనంతరం రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించేందుకు పోలీస్ కమిషనర్ అంగీకరించడంతో చర్చలు ముగిశాయి. ఈ ఆందోళనలో రైతులతో పాటు కార్మికులు, వ్యవసాయ కార్మికులు, డివైఎఫ్ ఐ, ఎస్ఎఫ్ఐ, ఐద్వా తదితర ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఎఐకెఎస్ కోశాధికారి కష్ణ ప్రసాద్, ఎఐకెఎస్ హర్యానా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సుమిత్, ఫూల్ సింగ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ పాల్గొన్నారు. కాగా క్రాంతి మాన్ పార్కులో రామ్ చంద్ర ఖార్గ్ అనే రైతు మరణించాడు. ఆయన మరణానికి కారణాలేంటో తెలియదు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
179వ రోజూ రైతు ఆందోళన
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఉద్యమం ఉధతంగా సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం సోమవారం నాటికి 179వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో రైతులు ఆందోళనల్లో వందలాది మంది రైతులు భాగస్వామ్యం అవుతున్నారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి వందలాది ట్రాక్టర్లతో వేలాది మంది ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. వివిధ రిపోర్టుల ప్రకారం రైతు ఉద్యమంలో ఇప్పటి వరకు 470 మందికి పైగా రైతులు అసువులు బాసారు.
''బ్లాక్ డే''
డీఎస్ఎంఎం సంపూర్ణ మద్దతు
మే 26న ''బ్లాక్ డే'' నిర్వహించా లని సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపుకు దళిత శోషణ్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) సంపూర్ణ మద్దతు తెలిపింది. ఆ రోజున దేశవ్యాప్తంగా నిరసన ఆందోళనలో భాగస్వామ్యం కావాలని అన్ని కమిటీలకు పిలుపు ఇచ్చింది. పెద్ద సంఖ్యలో సమీకరించాలనీ, పిలుపుకు మద్దతుగా ముందుకు వచ్చిన వారందరితో పాటు నిలబడాలని డీఎస్ఎంఎం కోరింది. సోమవారం ఈ మేరకు డీఎస్ఎంఎం ప్రకటన విడుదల చేసింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టాన్ని తీసుకురావాలని, ''కమిషన్ ఫర్ ది ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నేషనల్'' రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల ఆర్డినెన్స్ 2020, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న రైతులు ఆందోళనలు ప్రారంభమై మే 26 నాటికి ఆరు నెలలు పూర్తి అవుతుందని డీఎస్ఎంఎం తెలిపింది.