Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైజర్, మోడెర్నా టీకా ఆర్డర్లు 2023 వరకు పూర్తిగా బుక్
- ప్రభుత్వ ముందుచూపు లేకనే : విశ్లేషకులు
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపత్యంలో దేశంలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఇప్పటికే వైద్య సౌకర్యాల లేమితో అనేక మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య సైతం అధికంగానే ఉంటోంది. కరోనా ప్రభావం తగ్గించడంతో పాటు మరణాలు లేకుండా చేయడం కోసం ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం టీకాలు తీసుకోవడమే. కానీ దేశంలో పూర్తి స్థాయి టీకాల కోసం మరో రెండేండ్లకు పైగా వేచివుండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం భారత్‌లో ఇప్పటికే టీకాల కొతర తీవ్రంగా ఉంది. చాలా రాష్ట్రాలు 18 నుంచి 45 ఏండ్ల లోపువారికి టీకాలు వేయడం ఇంకా ప్రారంభించ లేదు. వ్యాక్సిన్ల కొరత కారణంగా పలు టీకా సెంటర్లు సైతం మూత పడ్డాయి. ఇదిలా కరోనా టీకాల కొరతను అధిగమించడానికి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగా ఇప్పటికే ఫైజర్, మోడెర్నా టీకా ఉత్పత్తి సంస్థలతో జర్చలు జరుపుతున్నాయి. చర్చలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. వ్యాక్సిన్ల ఇప్పట్లో అందే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఫైజర్, మోడెర్నా టీకాల ఆర్డర్లు 2023 వరకు బుక్ అయ్యాయి. దీంతో భారత్ ఈ టీకాల కోసం మరో రెండేండ్లకు పైగా ఎదురుచూడాల్సి పరిస్థితి ఏర్పడింది.
కాగా, భారత్‌లో టీకా అత్యవసర వినియోగం కోసం ఫైజర్ సంస్థ గతంలోనే దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను నిపుణుల కమిటీ తిరస్కరించడంతో ఫైజర్ తన దరఖాస్తును ఉపసంహరించుకుంది. ఆ తర్వాత దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌తో ఏప్రిల్ 13న ప్రభుత్వం విదేశీ వ్యాక్సిన్లపై కీలక ప్రకటన చేసింది. డబ్ల్యూహెచ్‌వో అనుమతినిచ్చిన వ్యాక్సిన్లు, ఇతర దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు భారత్‌లో రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని తెలిపింది. అయితే, ఇప్పటివరకు ఫైజర్, మోడెర్నా సంస్థలు భారత్‌లో ఎలాంటి ఒప్పందానికి రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ టీకా దిగుమతిపై అక్కడి వ్యాక్సిన్ తయారీ సంస్థలతో చర్చించనున్నారు. కాగా, భారత్ కంటే ముందే చాలా దేశాలు ఆ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయి. అమెరికా సహా యూరోపియన్ యూనియన్ దేశాలు వందల మిలియన్ల డోసులకు ఆర్డర్లు ఇచ్చాయి. 2023 దాకా ఈ ఆర్డర్లనే డెలివరీ చేయనున్నట్టు సమాచారం. మిగులు టీకాలు ఉంటే తప్ప ఫైజర్, మోడెర్నా మన దేశానికి వ్యాక్సిన్లు సరఫరా చేయలేవని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తాజాగా వెల్లడించారు. అయితే, ప్రభుత్వ ముందు చూపు కొరవడటంతో దేశంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.